సినిమా చూసే లోపు లండన్ చేరు కోవచ్చు

- June 21, 2017 , by Maagulf
సినిమా చూసే లోపు లండన్ చేరు కోవచ్చు

సినిమా చూసేంతలోపే చేరుకోవచ్చు..! 
సుదూర ప్రాంతాల మధ్య విమాన ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్సోనిక్ వాణిజ్య విమానాలతో ఓ అంకుర సంస్థ ముందుకు వచ్చింది. అత్యంత వేగంగా దూసుకెళ్లే ఈ విమానాలు లండన్ నుంచి న్యూయార్క్కు కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' సినిమా సమయం కంటే తాము తక్కువ సమయంలోనే ప్రయాణికులను లండన్ నుంచి న్యూయార్క్ చేరవేస్తామని పేర్కొంటున్నారు. ప్రస్తుత వాణిజ్య విమానాలకంటే రెండు రెట్ల అధిక వేగంతో ఇవి దూసుకెళ్తాయని చెప్పారు.
డెన్వర్లోని ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ 'బూమ్' ఈ విమానాలకు సంబంధించిన విషయాలను పారిస్ ఎయిర్షోలో వెల్లడించింది. అన్ని అడ్డంకులను అధిగమిస్తే.. తాము మరో ఆరేళ్లలో అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని ప్రయాణికులకు అందిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి టోక్యోకు ప్రస్తుతమున్న 11 గంటల సమయాన్ని 5.5 గంటలకు, లాస్ఏంజిల్స్ నుంచి సిడ్నీ మధ్య ప్రస్తుత 15 గంటల సమయాన్ని 7గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లే బూమ్ విమానాల కోసం ఇప్పటికే ఐదు విమానయాన సంస్థలు 70 ఆర్డర్లు ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.
గతంలో ఇలాంటి సూపర్సోనిక్ విమానాలను రూపొందించిన యూరోపియన్ విమానాయన సంస్థ 'కాంకర్డ్' తన కార్యకలాపాలను 2003లో మూసివేసింది. భారీ ఆర్థిక భారమే వాటి వైఫల్యాలకు కారణం. మరోవైపు సూపర్సోనిక్ విమానాలపై పలు పరిమితులు కూడా ఉన్నాయి. ఇవి చేసే భారీ శబ్ధాల కారణంగా అమెరికా, ఇతర దేశాల్లో వీటికి అనుమతి లేదు. అయితే ఈ శబ్ధాలను తగ్గించే విధంగా తాము ఈ విమానాలను రూపొందిస్తున్నట్లు బూమ్ సంస్థ ప్రతినిధి తెలిపారు. కాంకర్డ్ సంస్థ ఎక్కడ విఫలమైందో తాము అక్కడే దృష్టిపెట్టి విజయం సాధిస్తామని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతతో ఇలాంటి సమస్యలను అధిగమించడమే కాకుండా నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గిస్తామని చెబుతున్నారు. 2022నాటికి తొలి విమానాన్ని అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com