ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యకతం చేసిన పలువురు సినీ ప్రముఖులు

- July 11, 2017 , by Maagulf
ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యకతం చేసిన పలువురు సినీ ప్రముఖులు

అమర్‌నాథ్ యాత్రికులపై ముష్కర మూకలు కాల్పులకు తెగబడి ఏడుగురి ప్రాణాలను బలిగొనడంపై సినీ ప్రముఖులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఉగ్రవాదుల దుశ్చర్యను పిరికిపంద చర్యగా దుయ్యబట్టారు. ఇక, బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా మాత్రం కారకులైన వారిని వెతికి మరీ చంపాలంటూ ఆక్రోషంగా ట్వీట్ పెట్టారు. ''ఇలా పిరికిపందలుగా, దొంగదెబ్బతీసి హింసకు పాల్పడడం వల్ల వారికి ఏమొచ్చింది. దీనికి కారకులైన వారిని వేటాడి చంపాలి. చనిపోయిన కుటుంబాలకు నా అశ్రు నివాళి'' అంటూ రణ్‌దీప్ హుడా ట్వీట్ చేశారు.
ఇక, ఉగ్రవాదుల దుశ్చర్యపై స్పందించిన కాజల్.. ''పిరికిపందలు. ఇదో పిరికిపంద చర్య. ఇలాంటి క్రూరానికి ఒడిగట్టిన వారిపై కోపం వస్తోంది. చనిపోయిన వారిని చూస్తే బాధేస్తోంది. బాధితుల కుటుంబాలకు నా సానుభూతి'' అంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ''అమాయకులైన అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసి మరో నీచానికి ఒడిగట్టారు. ఉగ్రవాదులపై కోపం.. బాధితులను చూస్తుంటే బాధ వేస్తున్నాయి'' అంటూ ట్వీట్ చేశారు.
యువ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ఇంకా కొంచెం ఘాటుగానే స్పందించారు. ''దమ్ముంటే ప్రత్యక్ష యుద్ధానికి రండి చూసుకుందాం.. ఎవరు గెలుస్తారో.. అమాయకుల ప్రాణాలను తీసినంత మాత్రాన మీరు పోరాడే ఉద్దేశం నెరవేరదు. ఇదో సిగ్గుమాలిన చర్య'' అంటూ తనలోని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఇక, ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని, బాధితులకు త్వరగా న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నట్టు ఫర్హాన్ అక్తర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com