నేడు ఏపీ సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ భేటీ
- July 30, 2017
ఉద్దానం బాధితుల సమస్యపై చర్చ
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సోమవారం భేటీ కానున్నారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్ధుల సమస్యలపై చర్చించే నిమిత్తం.. ఉదయం పదిన్నర గంటలకు సచివాలయంలోని సీఎం కార్యాలయానికి వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివా్‌సతో కలిసి పవన్ రానున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఈ సమస్య పరిశీలనకు వచ్చిన వైద్య నిపుణులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర వైద్యులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వం కొంతకాలం క్రితం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉద్దానం ప్రజలందరికీ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించింది. మరి కొన్ని ఏజెన్సీలు ఈ సమస్యపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలిచ్చాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వైద్య, రక్త పరీక్షల్లో వెల్లడైన ఫలితాలు, గతంలో వచ్చిన నివేదికలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీలో చర్చకు రానున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. వీటన్నిటి ఆధారంగా భవిష్యత్ వ్యూహమేమిటో చర్చ జరిగే అవకాశం ఉంది. హార్వర్డ్ నిపుణులతో నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా పవన్‌ను సీఎం స్వయంగా కోరారు. అందుకు పవన్ వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కిడ్నీ రిసెర్చి అండ్ కేర్ సెంటర్ అవశ్యం: డాక్టర్ జోసెఫ్ ఉద్దానం కిడ్నీ సమస్యలపై అధ్యయనం చేయడానికి హార్వర్డ్ నుంచి వచ్చిన డాక్టర్ జోసెఫ్ వి బోన్‌వెంట్రే మాట్లాడుతూ.. అక్కడ నొప్పి నివారణ మందులు అధికంగా వినియోగించడం, తాగునీటిలో భార లోహాలు, మోతాదుకు మించిన ఎరువుల వినియోగం, జన్యుపరమైన లోపాలు తమ దృష్టికి వచ్చాయని వివరించారు. ‘ఎక్కువగా 20 ఏళ్లలోపు పిల్లలే కిడ్నీ వ్యాధులకు గురువుతున్నట్లు గమనించాను. వివాహితులైన ఏడుగురు మహిళలను పరిశీలిస్తే.. ఆ ఏడుగురూ కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నట్లు తేలింది. వాతావరణ కాలుష్యం కూడా కొంత కారణమని భావిస్తున్నాం. ఈ సమస్యలపై సేవా సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపాలంటే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కిడ్నీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఒకటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. బయో బ్యాంకింగ్, కిడ్నీ మార్పిడి వంటి సౌకర్యాలు కల్పించాలి’ అని తెలిపారు. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ, తల్లిదండ్రులు చనిపోగా అనాథలైన ఇద్దరు బాలలను జనసేన సభ్యులు దత్తత తీసుకున్నారని తెలిసి వారిని పవన్‌కల్యాణ్ అభినందించారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సీనియర్ డాక్టర్ చంద్రశేఖర్‌కు ఆయన పాదాభివందనం చేశారు. హార్వర్డ్ నుంచి వచ్చిన మరో తెలుగు డాక్టర్ వెంకట్ సుబ్బిశెట్టి ఇక్కడి పరిశోధనలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







