ఓమాన్ లో ఉద్యోగాలుపోయి రోడ్డునపడ్డ 200 మంది తెలుగు కార్మికులు

- August 16, 2017 , by Maagulf
ఓమాన్ లో ఉద్యోగాలుపోయి రోడ్డునపడ్డ 200 మంది తెలుగు కార్మికులు

* దీనస్థితిలో గల్ఫ్ నుండి స్వదేశం చేరిన వలసకార్మికులు
*  ఉద్యోగాలు ఊడిపోయి ఉట్టిచేతులతో ఇంటికి చేరిన గల్ఫ్ వలసజీవులు 

ఓమాన్ దేశంలోని  'పెట్రోన్ గల్ఫ్' అనే కంపెనీ మూతపడటంతో  900 మంది భారతీయ కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలురాక, తిండిలేక అలమటిస్తున్నారు. వీరిలో 30 మంది తెలంగాణ, 170 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారున్నారు. గత ఎనిమిది నుండి  పదేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న వీరికి నాలుగు నెలల జీతం, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరికి రూ.3 నుంచి 4 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నది. కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి లేబర్ కోర్టులో కేసు పోరాడాడటానికి మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ పేరిట పవర్ ఆఫ్ అటార్నీ అధికారం ఇచ్చారు. 

మొదటి విడతగా వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి ఇండియన్ ఎంబసీ ఉచిత విమాన టికెట్లు సమకూర్చి బుధవారం (16.08.2017) మస్కట్ నుండి ఇండియాకు పంపించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ కు చెందిన జడల బాబయ్య, నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు చెందిన  వొటార్కర్ భూమేష్, ఆంద్ర ప్రదేశ్ కు చెందిన గుజ్జు లక్ష్మణ మూర్తి, చింత తులసి రావు, మోటూరి గణేష్ లు ఓమాన్ ఏర్ ప్లయిట్ నెంబర్ డబ్ల్యూ. వై -235  ద్వారా బుధవారం ఉదయం మస్కట్ నుండి హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్ కన్వీనర్ గణేష్ గుండేటి చేతి ఖర్చులకు తెలంగాణ వారికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి రూపాయలు అందజేసినట్లు వారు తెలిపారు. 
పునరావాసం, న్యాయ సహాయం కావాలి 
కంపెనీ యాజమాన్యం మోసానికి బలై వాపస్ పంపివేయబడ్డ వలసకార్మికులను ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించాలని, సంక్షేమ పథకాలలో లబ్ధిదారులుగా ఎంపికచేసి ఆదుకోవాలని  తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బకాయిలు రాబట్టుకోవడానికి న్యాయ సహాయం అందించాలని కోరారు. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు అవకాశమున్న చోట ఉద్యోగాలు కల్పించాలని మస్కట్ లోని భారత రాయబారి ఇంద్రామని పాండే ఓమాన్ లోని పలు కంపెనీలను సంప్రదించడంపట్ల దేవేందర్ రెడ్డి అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com