మునిగిన నౌకలో విలువైన బంగారం.. ఎలా బయటపడింది?

- August 26, 2017 , by Maagulf
మునిగిన నౌకలో విలువైన బంగారం.. ఎలా బయటపడింది?

రెండో ప్రపంచ యుద్ధంలో మిస్సయిన SS మిన్‌డెన్ నౌక జాడ ఇప్పుడు దొరికింది. అందులో వెలుగు చూసిన నిధి చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. పెద్ద పెద్ద బాక్సుల్లో బంగారం ఉంది. అదెంతో తెలుసా? 4 టన్నులు. దీని విలువ మన కరెన్సీలో 840 కోట్లు. మరి ఇంత పెద్దమొత్తం బంగారాన్ని ఎవరు తరలించారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 80 ఏళ్ల తర్వాత నౌక ఎలా బయటపడిందన్నది పరిశీలిస్తే.. నమ్మలేని నిజాలు బయటపడతాయి. 

అవి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజులు. భీకర పోరు కొనసాగుతోంది... ఆ తర్వాత కొన్ని రోజులకే అంటే 1939 సెప్టెంబర్ 6వ తేదీన నాలుగు టన్నుల బంగారంతో SS మిన్‌డెన్ అనే నౌక బయలుదేరింది. పెద్ద పెద్ద పెట్టెల నిండా బంగారాన్ని నింపుకుని బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఆ నౌక గమ్యాన్ని చేరలేదు. కానీ, 1939 సెప్టెంబర్ 24వ తేదీన నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలోని ద్వీప దేశం ఐస్ ల్యాండ్ వద్ద సముద్రంలో మునిగిపోయింది..

నౌక మునిగిపోయిన తర్వాత దాదాపు 80 ఏళ్లకు దాని జాడను కనుగొన్నారు బ్రిటీష్ ట్రెజర్ హంటర్స్. నౌకలో ఉన్న పెద్దపెద్ద పెట్టెల్లో నాలుగు టన్నుల బంగారం ఉందని భావిస్తున్నారు. దీని విలువ 100 మిలియన్ల బ్రిటీష్ పౌండ్స్. అంటే మన కరెన్సీలో 840 కోట్లు. మరి ఈ సంపద ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సముద్రంలో షిప్ మునిగిపోయిందా? కావాలనే ముంచేశారా? ఇది తేల్చేపనిలో పడ్డారు బ్రిటీష్ అధికారులు. అయితే ఈ నౌక... జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కోసమే జర్మనీకి బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు బ్రిటీష్ అధికారులు నౌకను సీజ్ చేయకుండా ఉండడానికి హిట్లర్ ఆదేశాల మేరకే కెప్టెన్ సముద్రంలో ముంచేశాడని భావిస్తున్నారు..

బ్రిటీష్ మెరైన్ శాఖకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని కనుగొన్నారు. అయితే నౌకలోని బాక్సుల్లో ఉన్న బంగారంతోపాటు మరేవైనా వస్తువులు ఉన్నాయా అని తెలుసుకోడానికి బ్రిటీష్ మెరైన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నౌక నుంచి బాక్సులను బయటకు తీయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఐస్‌ల్యాండ్ ప్రభుత్వ నుంచి పర్మిషన్ కోరారు. 
  
ఈ నిధిని వార్ క్రిమినల్స్, ఫైటర్స్, పదవీ విరమణ చేసిన జనరల్స్ కోసం వినియోగించడానికి హిట్లర్ రహస్యంగా తెప్పించే ప్రయత్నం చేసినట్లు బ్రిటీష్ అధికారులు భావిస్తున్నారు. కావలసిన దానికంటే ఎక్కువ నిధులను హిట్లర్, నాజీ పార్టీ విదేశాల నుంచి సేకరించినట్లు అంచనాకు వచ్చారు. ఇటీవల హిట్లర్‌కు సంబంధించిన కొన్ని వస్తువుల పెట్టెలు దొరకడమే ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.

ఇక ఆ భారీ పెట్టెలను నౌక నుంచి బయటకు తెస్తేగానీ అందులో ఏమున్నాయో తెలియదు. అందుకే బ్రిటీష్ మెరైన్ అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com