యమ్మెస్ రాజు నిర్మాతగా ప్రవేశించి పాతికేళ్లయ్యింది
- October 27, 2015
''నిర్మాతగా పలు జయాపజయాలు చూశాను. విజయాలకు పొంగిపోలేదు. అపజయాలకు కుంగిపోలేదు'' అని నిర్మాత యమ్మెస్ రాజు అన్నారు. ఈ దసరాతో ఆయన నిర్మాతగా ప్రవేశించి పాతికేళ్లయ్యింది. ఈ సందర్భంగా పాత్రికేయులతో తన కెరీర్, ఇతర విశేషాల గురించి ఎమ్మెస్ రాజు పంచుకున్న విశేషాలు... ఆయన మాటల్లోనే... తొలి సినిమా 'శత్రువు'ను ప్యాషన్‌తో నిర్మించాను. ఆ తర్వాత నిర్మించిన 'పోలీస్ లాకప్' కూడా విజయం సాధించింది. మూడో సినిమా 'స్ట్రీట్ ఫైటర్' స్ట్రీట్‌కి తెచ్చేసింది. కానీ, అధైర్యపడలేదు. ఆ తర్వాత తీసిన 'దేవి' విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఓ టెక్నికల్ వండర్ చూపించాలనే ఆకాంక్షతో 'దేవీపుత్రుడు' తీశాను. ఆ చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో, జీవితంలో మళ్లీ సక్సెస్ వస్తుందా? అనుకున్నాను. నేను స్టోరీ, స్క్రీన్‌ప్లే తయారు చేసుకుని 'మనసంతా నువ్వే' నిర్మించాను. ఆ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'నీ స్నేహం' కూడా ఫర్వాలేదనిపించుకుంది. వరుసగా మూడు సంచలన విజయాలు 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'... ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత తీసిన 'పౌర్ణమి' నాకు అమావాస్య అయ్యింది (నవ్వుతూ). ఓ పాజిటివ్ మైండ్‌తో 'ఆట' తీస్తే, సక్సెస్ అయ్యింది. అప్పుడే కన్నడ చిత్రం 'ముంగారు మళె'ని 'వాన'గా నా దర్శకత్వంలోనే రీమేక్ చేశాను. క్లయిమ్యాక్స్ వల్లే కన్నడ చిత్రం ఆడిందనీ, మార్చొద్దనీ వేరేవాళ్లు అంటే, అలానే ఉంచేశాను. క్లయిమ్యాక్స్ వల్లే ఆ సినిమా పోయింది. అప్పుడనుకున్నా.. మన మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని. ఈ నాలుగేళ్లు విలువైనవి 'మస్కా' తర్వాత మా బేనర్లో మళ్లీ సినిమాలు తీయలేదు. ఈ నాలుగేళ్ల విరామాన్ని మా అబ్బాయి (సుమంత్ అశ్విన్) కెరీర్‌పై దృష్టి పెట్టడానికి వినియోగించాను. తెలుగు, హిందీ.. ఇలా భాషాభేదం లేకుండా అన్ని సినిమాలూ చూసి, అప్‌డేట్ అవుతుంటాను. ఆ అవగాహనతో మా అబ్బాయి ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందో ప్లాన్ చేశాను. ఇప్పటివరకూ తను ఆరు సినిమాల్లో హీరోగా నటిస్తే, నాలుగు సక్సెస్ అయ్యాయి. ఆ విధంగా తన కోసం కేటాయించిన ఈ నాలుగేళ్లు నాకు విలువైనవిగా అనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సుమంత్ అశ్విన్ 'కొలంబస్' సక్సెస్ బాటలో సాగడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి నేనే కథ-స్క్రీన్‌ప్లే ఇచ్చాను. ఈ చిత్రవిజయానికి స్క్రీన్‌ప్లే ఓ కారణం అని అందరూ అంటున్నారు. కమల్, ఆమిర్ దారిలో మా అబ్బాయి... కమలహాసన్, ఆమిర్‌ఖాన్, అజిత్ వంటి హీరోలను తీసుకుంటే.. వాళ్లు ముందు సాఫ్ట్ రోల్స్ చేసి, ఆ తర్వాత పవర్‌ఫుల్ రోల్స్ చేశారు. తిరుగు లేని మాస్ హీరోలనిపించుకున్నారు. మా అబ్బాయి కూడా వీళ్ల బాటలో ఇప్పుడు తన వయసుకి తగ్గట్టుగా ప్రేమకథా చిత్రాలు, లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ గ్రాఫ్ పెంచుకుంటాడు. భవిష్యత్తులో ఈ ముగ్గురి హీరోల్లా స్థిరపడతాడు. మహేశ్, ప్రభాస్ వెరీ సపోర్టివ్ నా సంస్థలో మహేశ్‌బాబు చేసిన 'ఒక్కడు', ప్రభాస్ చేసిన 'వర్షం' సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఇప్పుడు వాళ్లిద్దరూ అగ్రహీరోలుగా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. మహేశ్, ప్రభాస్ నాకెప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఈ మధ్య మహేశ్‌ని కలిసినప్పుడు 'ప్లాన్ చేయండి... సినిమా చేద్దాం' అనడం ఆనందం అనిపించింది. వచ్చే ఏడాది మా సుమంత్ ఆర్ట్స్ బేనర్లో ఓ స్టార్ హీరోతో, మా అబ్బాయితో ఓ సినిమా నిర్మిస్తా. చిన్న క్లూ ఏమిటంటే ఆ స్టార్ హీరో మా బేనర్లో ఒక సినిమా చేశాడు. వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







