హుబ్లీలో తెలుగు విద్యార్థులను అడ్డుకున్న కన్నడ సంఘాలు

- September 09, 2017 , by Maagulf
హుబ్లీలో తెలుగు విద్యార్థులను అడ్డుకున్న కన్నడ సంఘాలు

హుబ్లీలో కన్నడిగులు వీరంగం సృష్టించారు. ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వచ్చిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. కర్ణాటక రీజినల్ రూరల్ బ్యాంక్ ఉద్యోగాలకు తెలుగువారని పరీక్షలు రాయనివ్వబోమని తేల్చి చెప్పారు. హుబ్లీలో పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడులు చేశారు. తమ ఉద్యోగాలను తన్నుకు పోతున్నారంటూ ఆరోపించారు. హుబ్లీ, గుల్బర్గా, దావణగెరె, బెంగళూరులో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

హుబ్లీ రైల్వే స్టేషన్ ముందు  ధర్నాకు దిగిన కన్నడిగులు అక్కడే చాలా మంది తెలుగువారిని అడ్డుకున్నారు. కన్నడ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే చంపేస్తామని బెదిరించారు. నంద్యాల నుంచి పరీక్ష రాయడానికి వెళ్లిన వారిపై దాడులు చేశారు. రెండు రోజుల క్రితమే కర్ణాటకకు వచ్చిన తెలుగువారిపై ఓ కన్నేశాయి కన్నడ సంఘాలు. తెలుగువారితో పాటు చాలా మంది కర్ణాటక విద్యార్థులు నంద్యాలలోనే కోచింగ్ తీసుకున్నారు. తెలుగువారు కర్ణాటకకు పరీక్షలు రాయడానికి వస్తున్నారని, వారే సమాచారం అందించారు. లాడ్జీల్లో ఉన్న వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జీల్లో తెలుగువారికి రూమ్ ఇవ్వొద్దని, ఆటోల్లో ఎక్కించుకోవద్దని హుకుం జారీ చేశారు. అటు పరీక్ష సెంటర్ల దగ్గరా అడ్డుకుంటామని చెప్పడంతో తెలుగు అభ్యర్థులు భయపడిపోతున్నారు. కన్నడ సంఘాల తీరుతో అంతరాయాలు కలగడంతో పరీక్షను అధికారులు రద్దు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com