దీపావళి విందు ఇవ్వనున్న అమెరికా అధ్యక్షడు ట్రంప్‌

- September 28, 2017 , by Maagulf
దీపావళి విందు ఇవ్వనున్న అమెరికా అధ్యక్షడు ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి దీపావళి సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌ 200 మంది భారత-అమెరికన్లకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఒబామా హయాం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 1600, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ విందు సందర్భంగా వీసా సంబంధిత అంశాలపై ట్రంప్‌ సానుకూలంగా స్పందిస్తారని భారత-అమెరికన్లు ఆశిస్తున్నారు. గతంలో షికాగో ప్రదర్శనలో భారత-అమెరికన్లు చేసిన విజ్ఞప్తిని కూడా ట్రంప్‌ పరిశీలిస్తారన్న ఆశాభావాన్ని ట్రంప్‌ మద్దతుదారు, రిపబ్లికన్‌ హిందూ కూటమి వ్యవస్థాపకుడు షాలభ్‌ కుమార్‌ వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి రంజాన్‌ (ఇఫ్తార్‌ విందు) ఉత్సవాలను జరిపే శ్వేతసౌధ సంప్రదాయానికి గత జూన్‌లో ట్రంప్‌ ముగింపు పలికారు. దీపావళి విందును కూడా రద్దు చేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్‌ ఒబామా దీపావళి విందుకు తొలిసారి ఆతిథ్యం ఇచ్చారు. అప్పటి నుంచి శ్వేతసౌధంలో దీపావళి సంబరాలు ఏటా జరుపుతూ వస్తున్నారు. ఈ ఏడాది మరింత ఘనంగా జరపాలని కోరుతూ ఇటీవల రిపబ్లికన్‌ సెనేటర్‌ ఓరిన్‌ హాచ్‌ శ్వేతసౌధానికి లేఖ రాశారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌-అమెరికన్లు మద్దతిచ్చినందున వారి ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. హాచ్‌ సూచనలకు శ్వేతసౌధం ప్రాధాన్యం ఇస్తున్నట్లు షాలభ్‌ కుమార్‌ ఓ వార్తాసంస్థకు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com