విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 'ఇండిగో' మెగా ఆపరేషన్స్‌

- October 04, 2017 , by Maagulf
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 'ఇండిగో' మెగా ఆపరేషన్స్‌

50 ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌
తొలి దశలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు ఆరు విమానాలు
 నవ్యాంధ్రప్రదేశ్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేటు విమానయాన సంస్థ 'ఇండిగో' సన్నాహాలు చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా దశల వారీగా మెగా ఆపరేషన్స్‌కు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో 50 ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు ఆ సంస్థ ఇటీవల ఆర్డర్‌ ఇచ్చింది. వీటిలో ఎక్కువ విమానాలు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచే నడపటానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో వచ్చే జనవరి నెల నుంచి ఆరు విమాన సర్వీసులను నడపటానికి ఇండిగో సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ విమాన సర్వీసులను నడపాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసుల షెడ్యూల్స్‌ టైమింగ్స్‌ను కూడా ఖరారు చేసినా.. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎటిఆర్‌ విమానాలు చేతికి వచ్చే దానిని బట్టి విమాన సర్వీసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు ఉదయం సమయంలో, చెన్నైకు సాయంత్రం సమయంలో, హైదరాబాద్‌కు రాత్రి సమయంలో విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించారు.
ఆరు నెలల కిందటే అధ్యయనం
ఇండిగో విమానయాన సంస్థ ఆరు నెలల కిందటే విజయవాడ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడపటానికి అధ్యయనం ప్రారంభించింది. విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ గురించి స్టడీ చేసింది. ఎయిర్‌ ట్రాఫిక్‌తో పాటు విజయవాడ విమానాశ్రయం నుంచి ఉన్న వసతులు, వనరులపై ఆమూలాగ్రం సర్వే చేసింది. ఇండిగో బృందాలు ఇక్కడికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలనలు కూడా జరిపాయి. సాంకేతిక వ్యవస్థలు, రన్‌వే, టెర్మినల్‌, పార్కింగ్‌ బేల వంటి వివరాలను తెలుసుకుని వెళ్లారు. రెండు నెలల కిందటే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో భారీ సంఖ్యలో ఇండిగో సంస్థ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట జరిపింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ కొద్దికాలం మూతపడిన 'ఎయిర్‌కోస్టా' సిబ్బందిని కూడా ఇండిగో సంస్థ రిక్రూట్‌ చేసుకుని హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చింది.
అంతర్జాతీయ హోదా ప్రకటన తర్వాత.. అతి పెద్ద ఎయిర్‌ కనెక్టివిటీ
విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత ఒకే సంస్థ ఇంత భారీ సంఖ్యలో విమానాలు నడపటం ఇదే మొదటిసారి. దశల వారీగా విమాన సర్వీసులు నడుపుతామని, ప్రస్తుతం తొలి దశ షెడ్యూల్స్‌ను మాత్రమే ప్రకటించామని చెబుతున్న నేపథ్యంలో, మిగిలిన దశలలో కూడా భారీ స్థాయిలో ఇతర నగరాలకు కనెక్టివిటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్‌ విజయవాడ కేంద్రంగా ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థల గుత్తాధిపత్యం నడుస్తోంది. ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా.. హైదరాబాద్‌కు స్పైస్‌జెట్‌ సంస్థ నిర్వహించే ఆపరేషన్స్‌ మోనోపలీగా ఉంటున్నాయి. దీంతో ఛార్జీలు కూడా భారీగా ఉంటున్నాయి. హైదరాబాద్‌కు అత్యవసరంగా వె ళ్లాల్సి వ స్తే.. రూ. 15 వేలను ఛార్జీ చేస్తున్నారు. అదే ఢిల్లీకి వెళ్లాలంటే ఎయిర్‌ ఇండియా సంస్థ సాధారణంగా రూ. 13 వేల నుంచి రూ. 17 వేల వరకు వసూలు చేస్తోంది. భారీ ఛార్జీలతో బెంబేలెత్తుతున్న విమాన ప్రయాణికులు ఢిల్లీకి నేరుగా కాకుండా హైదరాబాద్‌ వరకు వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్‌లో ఢిల్లీ వెళుతున్నారు. బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు పలు విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి కాబట్టి.. ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇండిగో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విమానాలు నడపటంతో విమానయాన సంస్థల మధ్య పోటీ నెలకొని తక్కువ ధరకే ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com