తెలుగు సాహిత్యానికి రారాజు 'వేటూరి'

- October 05, 2017 , by Maagulf
తెలుగు సాహిత్యానికి రారాజు 'వేటూరి'

వేటూరి సుందరరామ్మూర్తి.. తెలుగు సాహిత్యానికి దొరికిన ఆణిముత్యాల్లో ఒకరు. అక్షరాలతో ఆడుకోవడం.. పదాలతో పదనిసలు పలికించడం.. అత్యున్నతమైన సాహితీ విలువలతో కూడిన పాటలు అందించడం ఆయనకే చెల్లింది. తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన వేటూరి డబ్బింగ్ పాటల్లోనూ అద్భుతమైన సాహితీ విలువలున్న పాటలు అందించారు. కేవలం లిప్ సింక్ కోసం పదాలు నింపేయకుండా ఒక్కోసారి ఒరిజినల్ రైటర్స్ సైతం ఆశ్చర్యపోయేంతటి సాహిత్యాన్ని అందించిన ఘనత వేటూరి సొంతం. 
డబ్బింగ్ గీతరచన సులువైంది కాదు. ఒరిజినల్ పాటకు దగ్గరగా సాహిత్యం ఉండాలి. పెదాల కదలికలకు అనుగుణంగా పదాలు పడాలి. లిప్ నాన్ సింక్ అయితే చూడడం ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు దాటుకుని రాయాలి కాబట్టే డబ్బింగ్ పాటలు ఏ కొందరో రాయగలిగారు. అయితే అన్ని ఇబ్బందుల్లో కూడా వేటూరి కలం కవితలు తొక్కుతుంది. ఏదో పదాలు నింపేయాలి కాబట్టి అని కాకుండా చాన్స్ వస్తే చాలు.. కవిత్వాన్నే అల్లేశారు.. 
డబ్బింగ్ సినిమాల్లోని సన్నివేశం లోతును అర్థం చేసుకుని కవిత్వాన్ని అల్లడం వేరు. ఈ టాస్క్ ను అలవోకగా చేసిన కలం వేటూరిది. మెరుపుకలలు చిత్రంలో అపరంజి మదనుడే అనువైన సఖుడులే అనే పాట ఆయన అత్యుత్తమ డబ్బింగ్ సాంగ్స్ లో ఒకటి. ఈ పాటకి మాధుర్యం, భక్తిభావం ఉట్టిపడేలా సంగీతాన్ని సమకూర్చడం రెహ్మాన్ గొప్పతనమైతే, క్రీస్తుని వినూత్నమైన పదప్రయోగాలతో వర్ణించి స్పందింపజెయ్యడం వేటూరి గొప్పతనం.
ఊహల్లో ఉత్సాహం, మనసులో ఆనందం నిండిఉన్నప్పుడు జీవితం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. నవ్వులు లేకుండా పువ్వులు దిగులుపడవు.. ఎగిరే గువ్వలకు కన్నీరు తెలియదు అంటూనే రాత్రిని చూడలేకపోయిన సూర్యుడు అంటూ బొంబాయి సినిమాలో పూలకుంది కొమ్మా అనే పాటలో వేటూరి కలం కవిత్వం చెబుతూ ఉంటే వింటోన్న చెవులు తన్మయత్వమైపోతాయ్..
ఇద్దరు సినిమా అనగానే “శశివదనే” పాట వెంటనే గుర్తుకు వస్తుంది. కానీ అదే సినిమాలో ఉన్న “పూనగవే పూలది” పాట కూడా ఆణిముత్యమే. ఎంతో సున్నితంగా, అందంగా, స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యేలా ఒక అమ్మాయి తన మౌన ప్రణయారాధనని నివేదించుకునే పాట. పాటంతా వినిపించే పదాలు ఎంతో లలితంగా, ట్యూన్‌కీ భావానికి తగ్గట్టు ఉంటాయి. 
అలాగే శశివదనే పాట కూడా ఏమాత్రం తక్కువేం కాదు. అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే అంటూ తనకే సొంతమైన గడసరి పదాలతో కవనం తొక్కుతాడు వేటూరి. ఇద్దరు సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. సినిమాలోని పాటలే కాదు.. ప్రకాష్ రాజ్ పాత్ర పలికే కవిత్వాలు కూడా వేటూరే రాశారు.. 
ప్రేమను వర్ణించడానికి విరహంలో ఉన్నవారు ఎవరైనా.. ప్రకృతిలోని ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ కవిత్వాల్ని అల్లుకోవడం కామన్. కానీ గాలిని వస్తువుగా తీసుకుని.. ప్రియురాలు పదిలంగా దాచుకున్న సొగసుని తలచుకుంటూ.. తన్మయుడైపోతోన్న ప్రియుని మనస్థితిని అద్భుతంగా కవిత్వీకరించారు వేటూరి. రిథమ్ సినిమాలో వినిపించే ఈ పాట మనస్సుకు ఎంత ప్రశాంతత ఇస్తుందో చెప్పలేం.
తొలిప్రేమ.. ఈ మాట తాలూకూ భావాలు పొందకుండా ఏ మనిషీ ఉండడు. ఆ భావాల్ని వ్యక్తపరచుకునే క్రమంలో కవిత్వం చెప్పుకోని హృదయమూ ఉండదు. ఆ భావన మనసును తొలిచినపుడు ఆ వ్యక్తి ఫీలింగ్స్ ను వేటూరి వ్యక్తపరచిన తీరే యూనివర్సల్. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అంటూ బొంబాయి సినిమాలో వినిపించే ఈ గీతం.. తొలిప్రేమ తాలూకూ భావనల్ని ఉన్నతంగా ఆవిష్కరిస్తుంది.
వేటూరి డబ్బింగ్ గీతాల్లో అత్యంత హృద్యమైన పాటల్లో బొంబాయి తర్వాత స్థానం సఖిదే. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, రెహ్మాన్ సంగీత సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే ఈచిత్రంలో తమిళ మహాకవి వైరముత్తు సాహిత్యాన్ని మైమరపించేలా వేటూరి సాహితీ సృజన కనిపిస్తుంది. 
వేటూరి స్ట్రెయిట్ సాంగ్స్ ఎంత పెద్ద విజయాలు సాధించాయో డబ్బింగ్ సాంగ్స్ కూడా అంతే సక్సెస్ అయ్యాయ్. ఒక్కోసారి ఒరిజినల్ కంటే ఈయన పాటే బావున్న సందర్భాలెన్నో. అలాంటి పాటల్లో ప్రేమిస్తే సినిమాలోని జన్మనీకేలే ఒకటి. ఓ దశాబ్ధం పాటు తెలుగునాడును ఊపేసిందంటే అతిశయోక్తి ఏముందీ.. వింటోన్న ప్రతిసారీ మనసును ఏదో తెలియని లోకాలకు తీసుకువెళ్లే సంగీతం సాహిత్యం ఈ పాట సొంతం.
ప్రేమిస్తే సినిమాలోని ఆ పాట మాత్రమే కాదు.. ప్రతి పాటనూ వేటూరి కుర్రాడైపోయి రాశాడా అనిపిస్తుంది. అన్ని రకాల భావోద్వేగాలూ నిండిన ఈ సినిమాలో పాటలకూ అదే స్థానం ఉంటుంది. అందుకే అన్ని పాటలూ వేటికవే గొప్పగా అనిపిస్తాయి. తాహతుకు మించిన అమ్మాయి ప్రేమలో పడ్డ కుర్రాడి భావాల్ని మట్టిలాంటి నన్ను పట్టిపట్టి చూసి శిల్పంలాగా చేసిందెవరో అంటూనే అటు అమ్మాయి భావాల్నీ అంతే అద్భుతంగా వర్ణిస్తాడు.
ప్రేమిస్తున్నాను.. అని చెప్పడమే అన్నిటికంటే అత్యున్నతమైన వ్యక్తీకరణ. అలాంటి ప్రేమను పంచినవాడిని తలచుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమించే ప్రేమవా అనిపిస్తాడు వేటూరి. ఇలాంటి సందర్భాల్లో ఆయన కలం ఎంత సున్నితంగా ఉంటుందో కానీ.. నువ్వునేను ప్రేమ సినిమాలో ఈ పాటను ఇష్టపడని యూత్ ఉంటుందా..?
మన్మథ సినిమాలోనూ ఇదే తరహాలో సాగే మరో పాటుంటుంది. మన్మథుడా నీ కలకన్నా అంటూ తన మనసుకు నచ్చినవాడు తారసపడగానే ఓ అమ్మాయి పాడుకునే పాట. నిన్నుకన్న తొలినాడే దేహం కదలక నన్ను పారేసుకున్నాగా ఎపుడో తెలియక అనే అద్భుతమైన పద ప్రయోగాలతో సాగే ఈ పాట చిత్రీకరణ కాస్త గందరగోళంగా ఉన్నా.. కళ్లుమూసుకుని వింటే మనసు దోచేస్తుంది.
తమిళనాట గొప్ప రచయితల్లో వైరముత్తు ఒకరు. వేటూరి ఆయన సమకాలీకులు కాకపోయినా సాహితీకాలీకులే. రాజాపార్వై అంటూ తమిళ్ లో వచ్చిన ఈ సినిమాలోని ఒకేపాటను ఇద్దరూ రాశారు. సుందరమో సుమధురమో అంటూ సాగే ఈ పాట డబ్బింగ్ కాకపోయినా.. వింటే భాష తెలియకున్నా రెండు పాటలనూ ఆస్వాదిస్తాం. కానీ ఎందుకో వేటూరినే కాస్త ఎక్కువ ఆస్వాదిస్తాం కూడా.. 
మోడ్రన్ టచ్ ఉన్న పాటల్లో కూడా వేటూరి కలం కదం తొక్కుతుంది. మణిరత్నం డైరెక్షన్ లో మళ్లీ రెహ్మాన్ సంగీతంలో వచ్చిన యువ సినిమాలో వచ్చిందా మేఘం అనే పాటలో సాహిత్యం కూడా ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అందుకే మణిరత్నం పిక్చరైజేషన్ మరింత అందాన్నీ తెస్తుంది. 
వేటూరి డబ్బింగ్ మూవీస్ లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలకే రాసినట్టు కనిపిస్తుంది.. లేదా ఆ పాటలే ఎక్కువ గుర్తింపు తెచ్చాయేమో. ప్రేమంటేనే కవిత్వం కదా. ఆ కవిత్వాన్ని సందర్భాలనిండా నింపుతారు కాబట్టే వేటూరి డబ్బింగ్ గీతాలు కూడా అజరామరం అయ్యాయి.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com