ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్న పవన్‌ కల్యాణ్‌

- October 07, 2017 , by Maagulf
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్న పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి హరిప్రసాద్‌ తెలిపారు. పవన్‌ ఇకపై నిరంతరం ప్రజల్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. 2014లో అప్పటి పరిస్థితుల మేరుకు భాజపా, తెదేపాలకు జనసేన మద్దతిచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి తమతో కలిసి వచ్చే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని పేర్కొన్నారు.
త్వరలో పవన్‌ 'ప్రజాయాత్ర' చేయడం ఖాయమని.. దీని ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారమేనని స్పష్టం చేశారు. పాదయాత్ర లేదా బస్సు యాత్ర లేక ఇతర ఏ రూపంలోనైనా ప్రజాయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన అజెండా అని.. ప్రభుత్వ నిర్ణయం ప్రజామోదమైతే ఆమోదిస్తామని లేకపోతే వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పారు.

ఏపీ ప్రత్యేక హోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే ఇస్తామని వెల్లడించారు. జనసేన కోసం పనిచేసే వారందరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com