హైదరాబాద్ వర్షాలకు అతలాకుతలం అవుతున్న జనజీవనం
- October 10, 2017
చెరువుల్లో ఉండాల్సిన నీరు ఇళ్లలోకి వచ్చింది. చెరువుల్లో తిరగాల్సిన పడవలు వీధుల్లోకి వచ్చాయి. ఇళ్లలో ఉండాల్సిన జనం బయటకు వెళ్లాల్సిన దుస్థితి. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఒక్క వానకే సాధ్యమైంది. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం, జనంలో పేరుకుపోయిన స్వార్థం, కబ్జాలను వర్షం కళ్లకు కడుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేది
సిటీలోని చాలా ప్రాంతాల్లో ... ఓ మోస్తరు వానపడినా వీధులు చెరువులను తలపిస్తాయి. చెరువుల్లో ఉండాల్సిన నీరు ఇళ్లలోకి వస్తుంది. రామాంతపూర్‌లోని పెద్ద చెరువు నిండి ఆ నీరంతా వారం రోజులుగా కాలనీలను ముంచెత్తడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడాలేదు. చెరువులు నిండితే నిజాంపేటలోని భండారి లేఅవుట్‌లోనూ సీన్ ఇలాగే ఉంటుంది. అక్కడి అపార్ట్ మెంట్ల సెల్లార్లన్నీ ఇప్పటికీ చెరువులను తలపిస్తున్నాయి. ఫ్లాట్లలో ఉన్నవాళ్లు బయటికి వెళ్లలేరు. బయట ఉన్నవారు లోపలికి రాలేరు. వరద నీరు వెళ్లిపోయేవరకు పాలవాళ్లు,
నీళ్ల వాళ్లు, పేపర్‌వాళ్లు ఎవరూ ఆ దరిదాపుల్లోకి రారు. పిల్లలు స్కూలుకు వెళ్లలేరు. పెద్దలు ఉద్యోగాలు చేయలేరు. ఎంతసేపూ సెల్లార్లలోని నీటిని బయటకు పంపడంపైనే అందరి దృష్టి ఉంటుంది.
ఇక పూరి గుడిసెల్లో ఉండే పేదల బతుకు మరీ దుర్భరం. వాన నీరు గుడిసెల్లోకి చేరి వస్తువులన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది. లేదంటే తడిపేస్తుంది. పొయ్యి వెలిగించలేరు. ఆ పూరింట్లో నిద్రపోలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడ ఒక్క క్షణం ఉండలేరు. వాన నీరు బయటకు వెళ్లిపోయేవరకు పరాయి పంచకు చేరాల్సిందే. లేదంటే వానలు తగ్గేదాక సొంత ఊరికి పయనం కావల్సిందే. కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే పేదల కడుపు నిండేదెట్లా? వాళ్ల కన్నీటి బాధలు వినేదెవరు? చివరకు.. నీళ్లల్లో పాములూ తిరుగుతుండడంతో జనం పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు.
హైదరాబాద్ పేరుకే హైటెక్ సిటీ. కానీ డ్రైనేజీలు, చెరువుల కబ్జాలు లోటెక్గా మార్చేశాయి. ఫలితంగా చినుకుపడినా సిటీ మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఒక్కరోజు వర్షానికే మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంత్ నగర్, లెనిన్ నగర్, మురళీకృష్ణానగర్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికీ కాలనీల వాసులు వరద నీటిలోనే నరకం అనుభవిస్తున్నారు. చివరికి తమ గోడు వినేవారులేక... బాలాపూర్ చౌరస్తాలో నిరసనకు దిగారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని కాలనీలు, వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న కాలనీలకు లెక్కేలేదు. చెరువుల్లోని నీరు ఇళ్లలోకి చేరినా... డ్రైనేజీలు ఉప్పొంగి వీధులను ముంచెత్తినా... ఆ నష్టం మాటల్లో చెప్పలేనిది. జనం కష్టాలకు ఖరీదు కట్టలేరు. వారి కన్నీటి బాధలను లెక్కించలేరు. మానసికంగా, శారీరకంగా వారు అనుభవించే వేదన ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. ఇక వర్షం నీటితో ఆహార పదార్థాలు తడిసిపోతాయి.
సెల్లార్లలోకి నీరు వస్తే దానితో లిఫ్టులు, మోటార్లు, మీటర్లు ఇలా అన్నీ కాలిపోతాయి. పార్కింగ్ చేసిన వాహనాలు మొరాయిస్తాయి. వాటికి రిపేర్లు చేయించాలి. నీటిని తోడేయడానికి మోటార్లు పెట్టాలి. వీటన్నింటికీ బోలేడు ఖర్చు. పైగా పెద్దలు పనులు మానుకుని, పిల్లలకు స్కూలు మాన్పించి ఇంట్లోనే ఉండాలి. వాన నీరు చుట్టూ ఉన్నన్నాళ్లు ఏ పాములు, విషకీటకాలు వస్తాయోననే టెన్షన్.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









