రైళ్లలో ప్రయాణికులకు విమాన తరహా భోజనం

- October 13, 2017 , by Maagulf
రైళ్లలో ప్రయాణికులకు విమాన తరహా భోజనం

రైళ్లలో ప్రయాణికులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే మెనూని మార్చాలని నిర్ణయం తీసుకుంది. విమానాల్లో సరఫరా చేసే ఆహారాన్ని రైళ్లలోని ప్రయాణికులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను రైల్వే కమిటీ బోర్డుకు అందజేసింది. దీనిపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
గ్రేవీ లేకుండా ఆహార పదార్థాలను అందించాల్సిందిగా కమిటీ తన నివేదిక ద్వారా ప్రతిపాదించింది. వెజిటేరియన్‌ బిర్యానీ, రాజ్మా ఛావల్‌, హక్కా నూడిల్స్‌, పులావ్‌, లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిందిగా కోరింది. రైళ్లల్లో అందించే ఆహారం మనుషులు తినేదిగా కూడా లేదని, నాణ్యత లోపాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో కాగ్‌ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు రైళ్లల్లో సరఫరా చేసిన ఆహారపదార్థాల్లో చనిపోయిన బల్లి, పురుగుల అవశేషాలు కనిపించిన సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రైల్వే తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగానే కొన్ని రైళ్లల్లో ట్యాబ్లెట్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను వెంటనే సేకరిస్తుంది. దీని ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com