అమెరికా డ్రీమర్ల కోసం టెక్‌ కంపెనీల లాబీయింగ్‌ కొత్త చట్టం

- October 21, 2017 , by Maagulf
అమెరికా డ్రీమర్ల కోసం టెక్‌ కంపెనీల లాబీయింగ్‌ కొత్త చట్టం

డ్రీమర్లను అమెరికా నుంచి ట్రంప్‌ ప్రభుత్వం తరిమేయకుండా చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు 24 టెక్‌, ఇతర సంస్థలు కూటమిగా ఏర్పడ్డాయి. యువ అక్రమ వలసదారులకు శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నట్టు రాయిటర్స్‌ సంస్థ పత్రాల ప్రకారం తెలుస్తోంది. వలసదారులు లేదా డ్రీమర్స్‌ను అమెరికాలోనే పనిచేసేలా ఈ ఏడాది చట్టం ఆమోదించాలని కాంగ్రెస్‌ను కూటమి డిమాండ్‌ చేయనున్నట్టు పత్రాల్లో ఉంది.
ఆల్ఫాబెట్‌ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, ఉబర్‌, ఐబీఎం, మారియెట్‌ ఇంటర్నేషనల్‌, అమెరికాలోని ఇతర ప్రముఖ సంస్థలు 'అమెరికా డ్రీమ్‌' కూటమి సభ్యులుగా ఉన్నారు. కూటమిలో ఉన్నట్టు ఉబెర్‌ మీడియాకు తెలిపింది. 'అమెరికా డ్రీమ్‌ కూటమిలో ఉబెర్‌ చేరింది. మేము డ్రీమర్స్‌ పక్షాన నిలిచాం.' అని ఆ సంస్థ అధికార ప్రతినిధి మాథ్యూవింగ్‌ తెలిపారు. తమ డ్రైవర్లకు ఇప్పటికే న్యాయ సహాయం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ 2013లో ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణల కోసం స్థాపించిన ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్‌ 800 కంపెనీలు సంతకాలు చేసిన లేఖను డ్రీమర్లకు మద్దతుగా కాంగ్రెస్‌కు పంపింది. అందులోని చాలా సంస్థలు సంకీర్ణంలో చేరుతున్నాయి.
'డ్రీమర్స్‌ మన సంఘంలో భాగం. వారు దేశాన్ని రక్షిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు.' అని కూటమి అభిప్రాయపడినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. 2013లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తొమ్మిది లక్షల మంది డ్రీమర్లను అమెరికాలో ఉండేందుకు అనుమతిచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. డ్రీమర్లను వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వారిలో కలవరం కలిగింది. అమెరికాలోని వివిధ వర్గాలు డ్రీమర్లకు మద్దతుగా నిలుస్తున్నాయి.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com