రారమ్మంటున్న మలేషియా పర్యాటకం

- October 27, 2017 , by Maagulf
రారమ్మంటున్న మలేషియా పర్యాటకం

ప్రకృతి అందాలు, ఆకాశ హర్మ్యాలు, సాహస క్రీడలు, ఆధ్యాత్మిక చింతన.. ఇలా ఎన్నెన్నో విశేషాలతొ మలేషియా పర్యాటకం పిలుస్తున్నది. మలేషియా పేరు వినిగానే కళ్లు జిగేల్మనే విద్యుత్‌కాంతుల కౌలాలంపుర్ స్ఫురిస్తుంది. అంతే నా.. సంద్రపు అలలు, అడవి అందాలు, మ్యూజి యం ముచ్చట్లు, షాపింగ్ సందడి ఇలా ఎన్నెన్నో. కనువిందు చేసే ఇన్ని అందాలను చూసేందుకు కాసింత సమయం వెచ్చించాల్సిందే మరి. హైదరాబాద్ పర్యాటకులకు మలేషియా అందాల్ని మరింత చేరువ చేస్తున్నది జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా గురువారం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మలేషియా ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ బెర్హార్డ్, మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా మలేషియా పర్యటన మరింత సులభతరం కానుంది. ఏటా లక్షలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న దక్షిణాసియా దేశం మలేషియా. ఆకాశహర్మ్యాలతో ఆకట్టుకునే మలేషియా రాజధాని కౌలాలంపూర్‌తో పాటు ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలు మదిదోచుకుంటాయి. ప్రపంచంలో అతి పెద్ద ట్విన్‌టవర్స్‌గా పేరొందిన పెట్రోనస్ టవర్స్ ఔరా అనిపిస్తాయి.

మలేషియాలోని మెర్డెకా స్కేర్, బటూ కేవ్స్, ఇస్తానా బుడయ, తీన్ హౌ టెంపుల్ వంటి పర్యాటక విశేషాలను తిలకించేందుకు ఏటా ఆరులక్షలమందికిపైగా భారతీయ పర్యాటకులు మలేషియాను సందర్శిస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు మ్యూజియాలు, ఉద్యానవనాలు, పశు పక్ష్యాదులతో పాటు అడ్వంచర్ టూరిజం టూరిజం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. సాంస్కృతిక వైవిద్యం మలేషియాను భిన్న సంస్కృతుల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. ఇస్లాం దేశమైనప్పటికీ హిందూ, క్రిస్టియన్, బుద్ధిజం వంటి అన్ని రకాల మతాలను ఆచరించే వాళ్లు ఇక్కడ కనిపిస్తారు.

దేశంలో అత్యధిక ప్రజలు ఆచరించే మతంగా రెండోస్థానంలో బుద్ధిజం కనిపిస్తున్నది. శతాబ్దాల చరిత్ర గల కట్టడాలు కనిపిస్తాయి. పెనాంగ్‌లోని కెక్ లాక్ సి టెంపుల్‌ని చూసేందుకు దేశ దేశాల పర్యాటకులు వస్తుంటారు. సెలంగోర్‌లోని బటు కేవ్స్‌ని సందర్శించేందుకు ఏటా లక్షలాది మంది వస్తుంటారు.

హిందూ దేవస్థానంగా పేరొందిన ఈ గుహల ముందు ఎత్తైన మురుగన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. నోరూరించే రుచులు మలేషియా పర్యాటకంలో పసందైన రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిల్లి పెప్పర్స్, బెలకన్, రెంపహ్ వంటి రుచులు పర్యాటకులను మైమరిపింపజేస్తాయి. కాంగీ, నాసి లెమక్, రోటి కనై వంటి వంటలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయి.

అందుకే... హాలీడే ట్రిప్స్ మొదలు వెడ్డింగ్, హనీమూన్ ట్రిప్స్‌కి ఎక్కువమంది మలేషియాను ఇష్టపడుతుంటారు. ఫిల్మ్ టూరిజానికి సైతం మలేషియా ప్రసిద్ధి. పలు భారతీయ చిత్రాలను మలేషియాలో నిర్మిస్తుండడం గమనించవచ్చు.

పది లక్షల మంది.. ప్రస్తుతం దేశం నుంచి ప్రతి సంవత్సరం ఆరు లక్షల మందికిపైగా పర్యాటకులు మలేషియాను సందర్శిస్తున్నారు. తాజాగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య పది లక్షలకు చేరుతుందని మలేషియా ఎయిర్‌లైన్ హోల్డింగ్స్ బెర్హార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ బద్లిషాం ఘజాలి తెలిపారు. అందుకోసం వీసా పద్ధతిని సులభతరం చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు మలేషియా టూరిజం నూతన ప్యాకేజీలతో ముందు కు రానుందన్నారు. హైదరాబాద్ నుంచి కేవలం నాలుగు గంటల్లో మలేషియా చేరుకోవచ్చు. ప్రస్తుతం మలేషియా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏషియా బెర్హార్డ్ రోజూ హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కి విమానాల్ని నడుపుతున్నాయి. త్వరలో మరికొన్ని ఎయిర్‌లైన్స్ కూడా ఈ రూట్‌లో విమానాల్ని నడిపేందుకు ముం దుకు రానున్నాయని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ లిమిటెడ్ సీఈఓ ఎస్‌జీకే కిశోర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com