యుద్దాన్ని తలపించనున్న ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన
- October 31, 2017
ఉత్తర కొరియా- అమెరికాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వరుసగా అణుపరీక్షలు నిర్వహిస్తున్న నార్త్ కొరియాకు చేతలతోనే బుద్దిచెపుతామంటోంది అమెరికా. అయినా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ లో ఏమాత్రం మార్పుకనిపించకపోగా... రోజురోజుకు దూకుడు పెంచడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. తన అమ్ములపొదిలో ఉన్న ఆయుధాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. ఒకవైపు నార్త్ కొరియా దూకుడు, మరోవైపు అమెరికా వార్నింగ్ నేపధ్యంలో ఇరుదేశాలమధ్య యుద్దం అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది. అయితే ప్రపంచదేశాలన్ని ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
కిమ్ జోంగ్ ఉన్ పరిచయం అక్కరలేని నేత. ఉత్తర కొరియా అధ్యక్షుడు. అగ్రరాజ్యం అమెరికాయే లక్ష్యంగా గత కొంతకాలంగా అణుపరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాడు. అయితే ఈయన చేస్తున్న చర్యలు సింహం ముందు చిట్టెలుక చేస్తున్న చర్యలుగా కొద్దిరోజులుగా భావించినా...ఇప్పుడు అమెరికాకు నిజంగానే కోపం తెప్పించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరియా విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. కిమ్ ఆటకట్టించాలనుకుంటున్నారు. సర్వం సన్నద్దంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు అందించారు.
దీనిలో భాగంగా అమెరికా రక్షణ శాఖ అధికారులు దక్షిణ కొరియా, జపాన్ దేశాల సైనిక అధికారులతో చర్చలు జరిపారు. ఉత్తర కొరియా విధ్వంసకర అణ్వాయుధ ప్రయోగాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అయితే అమెరికా ఓ వైపు ఆసియా దేశాలతో సంప్రదిస్తూనే.....తమ అమ్ములపొదిలో ఉన్న అత్యంత శక్తివంతమైన బి-2 స్టెల్త్ జెట్ యుద్దవిమానాలను అణ్వాయుధాలతో నింపేందుకు చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన విమానాలను బయటకు తీయడం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
బి-2స్టెల్త్ జెట్ విమానాలు అత్యంత అధునాతన, శక్తివంతమైనవి. ప్రపంచంలో ఎక్కడైనా అణుదాడి చేయగల సత్తా వాటిసొంతం. శత్రుదేశ రాడార్లకు అందకుండా గోప్యంగా ప్రయాణించగలవు. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నటిక్, రాడార్ సిగ్నల్స్ ఈ విమాన గమనాన్ని గుర్తించలేవు. ఇలాంటి విమానాలను అమెరికా ఇప్పుడు బయటకు తీయడం యుద్ద సన్నద్దతకు దారితీస్తుందని విశ్లేషలకు భావిస్తున్నారు.
ఉత్తర కొరియా యుద్దానికి సిద్దమైతే... ఆసియా దేశాలన్నీ తమ వద్ద ఉన్న అణు ఆయుధాలను బయటకు తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణుడు హెన్రీ ఆర్ కిస్సింగర్ అన్నారు. నార్త్ కొరియా ఆటలు కట్టించేందుకు ఆసియా దేశాలు ఏకం కావాలన్నారు. మొత్తానికి గత కొద్దిరోజులుగా అమెరికా దూకుడు చూస్తుంటే యుద్దం అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా సరిహద్దుల్లో భారీగా యుద్దవిమానాలను, వైమానిక నౌకలను చేర్చడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..