రేయాన్‌ స్కూల్‌ విద్యార్థి హత్య కేసులో కీలక మలుపు

- November 10, 2017 , by Maagulf
రేయాన్‌ స్కూల్‌ విద్యార్థి హత్య కేసులో కీలక మలుపు

హర్యానా : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి ప్రద్యుమన్‌ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. 11వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. అతనిని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించినట్లు సిబిఐ పేర్కొంది. స్కూల్‌ పరీక్షలు, తల్లిదండ్రులతో సమావేశాలను ఆపివేసేందుకే ఆ విద్యార్థి ఈ దురంతానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో బస్సు కండక్టర్‌ అశోక్‌ కుమార్‌ను నిందితుడుగా పేర్కొంటూ గుర్‌గావ్‌ పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా, ఇప్పుడు అశోక్‌ నేరం చేయలేదని నిర్ధారణ కావడంతో జైలు నుండి విడుదలైన వెంటనే పోలీసులు, స్కూల్‌ యాజమాన్యంపై కేసును నమోదు చేయనున్నట్లు, అతని తరపు న్యాయవాది మోహిత్‌ వర్మ తెలిపారు. సిబిఐ తన విచారణలో కొన్ని కీలక అంశాలను పేర్కొంది. ఫోరెనిక్స్‌ నివేదిక అందించిన సమాచారం ప్రకారం హత్యకు ఒక ఆయుధాన్ని వినియోగించారని తేలింది. దానిని నిందితుడు స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేశాడని సిబిఐ పేర్కొంది. గుర్‌గావ్‌ పోలీసులు కండక్టర్‌ అశోక్‌ కుమార్‌ ఈ హత్య చేసినట్లు పేర్కొనడంతో కేసు తప్పుదోవ పట్టిందని ఆరోపించారు.

ఈ కేసును సిబిఐకి అప్పగించామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నించినట్లు గుర్‌గావ్‌ పోలీసు అధికారి సందీప్‌ కెర్వాల్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com