ఓరుగల్లులో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

- November 13, 2017 , by Maagulf
ఓరుగల్లులో  పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

ఎన్నాళ్లో వేచిన రోజు రానే వచ్చింది. భూలోకంలో కైలాసం ఆవిష్కృతం కానుంది. ఓరుగల్లులో టీవీ5, హిందూధర్మం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆదిదంపతుల కళ్యాణ సంరంభానికి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ అద్భుత వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు తహతహలాడుతున్నారు.

కైలాసనాధుడు అపర్ణణను పరిణయమాడే ఘట్టానికి వేదిక కాబోతోంది.. చరిత్ర కనీవినీ ఎరుగని ఈ అధ్యాత్మిక మహోత్సవానికి టీవీ5 శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడులాగే ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఆ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యే సమయం మరెంతో దూరం లేదు.. వేలమంది భక్తులు ఒకచోట చేరి ఆదిదంపతులను సేవించుకునే ఆ మహాద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది టీవీ5. రుద్రుడు శివుడిగా మారి దివ్యాభరణాలను ధరించి వరుడుగా వేంచేస్తున్న వేళ.. ముల్లోకాలను పాలించే ఆ ఆదిశక్తి పార్వతియై ఆది దేవుణ్ని పరిణయమాడే ఆ అద్భుత సందర్భం మాటలకందనిది. పార్వతీ పరమేశ్వరుల సిగ్గు దొంతరల నడుమ కల్యాణోత్సవం అమోఘం.. అపూర్వం.. అద్వితీయం..

తన బిడ్డల కోరిక మన్నించి ఎన్నో అవతాలను దాల్చినా, చివరకు ఆ ముక్కంటి చెంతకే చేరింది. పరమశివుణ్నే పెళ్లాడింది. ఇప్పుడు కూడా భక్తకోటిని కటాక్షించడం కోసం దివి నుంచి భువికి రాబోతున్నారు ఆ ఆదిదంపతులు. భక్తుల కోసం మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి జరిపిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ ఏడాది ఏకశిలానగరం ఓరుగల్లు వేదికైంది. సాక్షాత్తు ఆ బ్రహ్మ దేవుడే పురోహితుడై.. నారాయణుడే కన్యాదాతగా మారి పంచ భూతాలు, అష్టదిక్పాలకులు, దేవతలంతా ఆశీర్వచన జల్లులు కురిపిస్తుండగా, ఆ కైలాసాన పార్వతీదేవిని పరమశివుడు పరిణయమాడే సందర్భం ఎన్నో పురాణాల్లో చూసి వుంటాం. కానీ, ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగితే నిజంగా జన్మ ధన్యమైనట్టే. ఆ బృహత్‌ కార్యాన్ని టీవీ-5 స్వీకరించింది. భక్తులకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కల్పించాలన్నదే లక్ష్యంగా మహా ఘట్టానికి తెరతీయనుంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతో ఈ బృహత్కార్యాన్ని చేపడుతోంది.

శివుణ్ణి మించిన స్త్రీ పక్షపాతి మరొకరు లేరు. ఎందుకంటే.. ఆకాశంలో సగం ఆడవారని మనం ఇప్పుడు చెబుతున్నాం. యుగాలనాడే ఈ వాదన వినిపించడమే కాదు, ఆచరణకు దిగిన అష్టమూర్తి ఆయనే. తనలో సగభాగాన్ని అర్థాంగికిచ్చానంటూ ఈశ్వరుడెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా, స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది. అలా ఆమె కలవడానికి అనువుగా మనసా వాచా కర్మణా తనను తాను మార్చుకోగలిగాడు. అలాంటి ఆదిదంపతులను సేవించుకోవడంకంటే అదృష్టం ఏముంటుంది? అందుకే.. ఆ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో.. చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ నగరంలో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తోంది టీవీ5. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com