ఇవాంకా కు సమంత ఇవ్వనున్న చీర

- November 26, 2017 , by Maagulf
ఇవాంకా కు సమంత ఇవ్వనున్న చీర

సిద్దిపేట: అమెరికా అధ్యక్షుడు డోనాల్ద్ ట్రంప్ కూతురు ఇవాంకకు తెలంగాణ చేనేత కార్మికుల ప్రతిభ తెలిసి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న ఇవాంకకు సిద్దిపేట కానుక అందనుంది.

సిద్దిపేటలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలు ఇవాంకకు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర చేర్చనున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేట ప్రాంతంలో 50ఏళ్ల నుంచి వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. పేటెంట్‌ హక్కులు కూడా సిద్దిపేటకు దక్కాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్నారు. వీటిని ప్రాచుర్యంలో తేవడానికి కృషి చేస్తున్నారు.
తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ సినీనటి సమంత కూడా ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెసిందే. వీటికి మరింత గుర్తింపు తెచ్చేందుకు ఆమె స్వయంగా ఇక్కడకు వచ్చి సూచనలు ఇస్తున్నారు.

కొన్ని డిజైన్లను కూడా సమంత ఎంపిక చేశారు. ఇందులో నుంచే ఇవాంకకు గొల్లభామ చీర అందజేయడంతో పాటు అక్కడికి వచ్చే మహిళలకు ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నూలు, సహజ రంగులను సరఫరా చేయిస్తూ గొల్లభామ చీరలను సమంత నేయిస్తూ వచ్చారు.

సమంత సూచనల మేరకు ఇప్పుడు గొల్లభామ చీరలు తయారై ఎగుమతులు కూడా మొదలయ్యాయి. నేతలో భాగంగా అంచులు, చీరల మధ్యలో అక్కడక్కడా గొల్లభామలు నేయడం ఇక్కడి చేనేత కార్మికుల ప్రత్యేకత. ఈ చీర నేయాలంటే ప్రత్యేకమైన మగ్గాలు అవసరం. నేసేందుకు నాలుగు రోజులు పడుతుంది.

గొల్లభామ చీరలది ఆరు దశాబ్దాల చరిత్ర. 2012లో గొల్లభామ చీరలకు పేటెంట్‌ హక్కులు వచ్చాయి. గతంలో ఈ సొసైటీ పరిధిలో సుమారు 40 మంది కార్మికులు గొల్లభామ చీరలు నేసేవారు. కూలీ గిట్టుబాటు కాకపోవడంతో ఇతర రకాల చీరలు నేస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని తుమ్మ గాలయ్య అనే మాస్టర్‌ వీవర్‌ ఒక్కరే గొల్లభామ చీరలను నేయిస్తున్నారు. 12 కుటుంబాల వారు మాత్రమే ప్రస్తుతం పనిలో ఉన్నారు.

చీరలు, చున్నీలపై తాను సూచించిన రీతిలో గొల్లభామలు ఉండేలా నేయాలని, అలా చేస్తే ఒక్కో కార్మికునికి నెలకు కనీసం రూ.10వేల ఉపాధి కలిగేలా చూస్తానని సమంత చేనేత కార్మికులకు ఇంతకు ముందు సూచించారు. హైదరాబాద్‌లోని ఒక షోరూంకు ఈ చీరలు, చున్నీలు సరఫరా చేయాలని సూచించారు. ఆదర్శ చేనేత సహకార సంఘంతో ఒప్పందం మేరకు రెండు నెలల క్రితమే ప్రత్యేక నూలు, నేచరల్‌ రంగులు సరఫరా చేయిస్తున్నారు. గొల్లభామ చీర నేసేవారికి రూ.1300 కూలీ ఇస్తున్నారు. 30 గొల్లభామ చీరలు, 30 చున్నీలను హైదరాబాద్‌ షోరూం వారు ఇంతకు ముందు తీసుకెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com