హైదరాబాద్: జీఈఎస్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేస్తున్న వివిధ దేశాల ప్రతినిధులు

- November 26, 2017 , by Maagulf
హైదరాబాద్: జీఈఎస్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేస్తున్న వివిధ దేశాల ప్రతినిధులు

హైదరాబాద్: భాగ్యనగరంలో జరుగునున్న జీఈఎస్ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నగరానికి చేరుకుంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 173 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. అమెరికా నుంచి వచ్చిన బ్రియానా కుక్, రహామాతుక్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఇండియాలో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. సదస్సులో తాము మహిళా సాధికారిత, వ్యవసాయ రంగంపై, లాభసాటి వ్యాపారంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
మంగళవారం నుంచి ప్రారంభంకానున్న సదస్సుకు 173 దేశాల నుంచి సుమారుగా రెండువేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, వెంచర్ క్యాప్టలిస్టులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాయబారులు, మంత్రులు, సినీతారలు సదస్సులో పాల్గొంటారు. అయితే సదస్సులో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులదే ప్రధాన భాగస్వామ్యం. నీతి ఆయోగ్, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంలో హైదరాబాద్‌లో ప్రస్తుత సదస్సు నిర్వహిస్తున్నారు.
అమెరికాలోని పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను మిగితా ప్రపంచంలోని ఔత్సాహికులతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ప్రపంచ పారిశ్రామిక సదస్సు గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా తొలిసారిగా ఒక భారీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో జరుపనుండటంతో అందరి దృష్టిదీనిపై కేంద్రీకృతమైంది. అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తితో భారత్‌లో సదస్సు నిర్వహణకు డోనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. దక్షిణాసియాలో సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మహిళలకు ప్రాధాన్యం అందరికీ సౌభాగ్యం అన్న నినాదంతో ఈసారి సదస్సు నిర్వహిస్తున్నారు. అందుకే సదస్సులో పాల్గొనే అవకాశం అత్యధికంగా మహిళా ప్రతినిధులకే కల్పించారు. మొత్తం ప్రతినిధుల్లో 52శాతం మంది మహిళలే. మొత్తం 127దేశాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు సదస్సుకు హాజరవుతున్నారు. పది దేశాల నుంచి అయితే కేవలం మహిళా ప్రతినిధులు మాత్రమే పాల్గొంటున్నారు. మనదేశం నుంచి హాజరవుతున్న ప్రతినిధుల్లో చందాకొచ్చర్, మిథాలీరాజ్, మానుషీచిల్లార్ సహా బిజినెస్, సినిమా రంగానికి చెందిన మహిళలు ఉన్నారు. అమెరికా నుంచి వస్తున్న ప్రతినిధి బృందానికి ఇవాంకా ట్రంప్ నాయకత్వం వహిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై సదస్సు ప్రత్యేక దృష్టిని సారించింది.
ఓ వైపు గ్లోబల్ సమ్మిట్, మరోవైపు మెట్రో రైలు ప్రారంభం వీటికి తోడు అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ కాన్వాయ్. ఇవిప్పుడు సైబరాబాద్ పోలీసులకు కత్తిమీదసాములా మారాయి. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సమ్మిట్ అంతా యూఎస్ సీక్రెట్ సర్వీస్ నిఘాలో జరుగుతుంటే...ఇవాంకా రూట్ మ్యాప్‌పై సస్పెన్స్‌లో ఉన్నారు సైబరాబాద్ పోలీసులు. వారితో పాటు ఎస్పీజీ ఇంటలీజెన్స్ వర్గాలు ప్రధాన భద్రతపై దృష్టిపెట్టారు. ఇప్పటికే బేగంపేట ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలో తీసుకుని తనిఖీలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com