తెలుగు మహాసభల ఏర్పాట్లను సమీక్షించిన సీఎం
- November 30, 2017
హైదరాబాద్: డిసెంబర్ 15 నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, సీఎస్, డీజీపీ, నందిని సిధారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలుగు భాసాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవెత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని సీఎం అన్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలన్నారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందిన సాహితీ వేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి సన్మానించలని సీఎం నిర్ణయించారు. అతిథులకు బస, భోజనం, రవాణాలాంటి సదుపాయాల కల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఒక్కో వేదిక వద్ద ఒక్కో ఇంచార్జ్ ఉండాలన్నారు.
ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మరిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరవుతారని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా సభలను ఆహ్వానించనున్నట్లు సీఎం తెలిపారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వస్తారని సీఎం స్పష్టం చేశారు. తెలుగు మహాసభల ప్రధాన వేదిక, ఎల్బీ స్టేడియం వేదిక డిజైన్, నగరంలో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను పరిశీలించిన సీఎం వాటిని ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సీఎం తెలిపారు.
మహాసభల సందర్భంగా నగరాన్ని అందంగా ముస్తాబు చేయాలన్నారు. ప్రారంభ, ముగింపు సభలు రెండూ ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రముఖులతో పాటు పండితులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తరన్నారు. భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చూసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మిగతా వేదికల వద్ద ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలన్నారు. స్టేడియంలో సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వంటకాల పేరుతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వివిధ కళా ప్రక్రియకు సంబంధించిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించే లేజర్ షో నిర్వహించాలన్నారు.
చివరి రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చాలన్నారు. నగరమంతా అందమైన అలంకరణలుండాలని.. నగరం పండుగ శోభను సంతరించుకోవాలని.. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని.. జంక్షన్లను అలంకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తెలుగు సాహితీ మూర్తుల పేర్లతో తోరణాలుండాలని... నగరమంతా బెలూన్లు ఎగువేయాలని సీఎం చెప్పారు.
తెలుగు భాషా ప్రక్రియలతోపాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూలో కవి సమ్మేళనం, కవ్వాలి లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. సభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంగీత, సాహిత్య, కళా రంగాలకు చెందిన ప్రముఖులను గౌరవించి, సన్మానించాలని సీఎం చెప్పారు. ప్రతీ కార్యక్రమానికి ఒక మంత్రిని ఆహ్వానించి ప్రభుత్వం తరుపున తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సన్మానం చేయించాలన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లను ఆహ్వానించాలన్నారు. పోస్టల్ శాఖ సమన్వయంతో తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేయాలన్నారు. ఎయిర్ పోర్టు, బస్ స్టాండు, రైల్వే స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి మహాసభలకు హాజరయ్యే వారికి సహాయపడాలన్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలన్నారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ సీఎం తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









