గురజాడ పురస్కారం అందుకున్న 'బాలు'

- November 30, 2017 , by Maagulf
గురజాడ పురస్కారం అందుకున్న 'బాలు'

ప్రముఖ సినీగాయకులు, గాన గాంధర్వులు ఎస్‌పి బాలసుబ్రమణ్యానికి విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యాన గురజాడ విశిష్ట పురస్కారాన్ని గురువారం అందజేశారు. మహాకవి గురజాడ అప్పారావు 102వ వర్థంతిని పురస్కరించుకుని విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాహితీ చైతన్యోత్సవ సభ జరిగింది. ఈ సభలో ఈ విశిష్ట పురస్కారాన్ని బాలసుబ్రమణ్యానికి రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ మంత్రి సుజరు కృష్ణ రంగారావు, సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సినీ రచయిత, నటులు గొల్లపూడి మారుతీరావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురజాడ స్వగృహంలో గ్రంథాల ప్రదర్శనకు, మ్యూజియంగా అభివృద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పురస్కార గ్రహీత బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గురజాడ తన కవితలు, రచనల ద్వారా మానసికోల్లాసంతోపాటు ప్రజల్లో ఆలోచనా శక్తిని పెంపొందించారన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సరైన పండితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జిఒలను అమలు చేయించుకునే బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. గురజాడ స్వగృహాన్ని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిద్దాలని, అందులో క్యూరేటర్‌గా పని చేస్తున్న గురజాడ కుటుంబ సభ్యుడి వేతనం రూ.20 వేలకు పెంచాలని కోరారు.

సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌, జిల్లా ఎస్పీ జి.పాలరాజు, ఎమ్మెల్యే మీసాల గీత, సమాఖ్య అధ్యక్షులు పి.వి.నర్సింహరాజు, మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రసాదుల రామకృష్ణ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com