పెషావర్‌లో ఉగ్ర అలజడి

- November 30, 2017 , by Maagulf
పెషావర్‌లో ఉగ్ర అలజడి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పెషావర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అగ్రికల్చర్ డైరెక్టరేట్ భవనంపై శుక్రవారం ఉదయం 8.15 గంటలకు ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖైబర్ టీచింగ్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. డైరెక్టరేట్ భవనంలోకి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడినట్లు తెలుస్తుంది. ముఖానికి మాస్కులు ధరించిన వీరు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. అక్కడి బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే అగ్రికల్చర్ హాస్టల్ ఉంది. హాస్టల్‌లో 100 మందికిపైగా విద్యార్థులున్నారు. ఇక ఆ ప్రాంతంలో పోలీసులు ఎమర్జెన్సీ ప్రకటించారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. 

భయంగా ఉంది : ప్రత్యక్ష సాక్షి 
ఉదయం 8.15 గంటలకు ముగ్గురు ముష్కరులు వచ్చి కాల్పులకు తెగబడినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తాము వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టామని.. అంతలోనే తమ కోలిగ్స్ ఇద్దరు కాల్పుల్లో గాయపడ్డారని పేర్కొన్నారు. హాస్టల్‌లో ప్రస్తుతం 120 మంది స్టూడెంట్స్ ఉన్నారని.. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో భయంగా ఉందని చెప్పాడు ప్రత్యక్ష సాక్షి. 

2014, డిసెంబర్ 16న పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 132 మంది పిల్లలను మట్టుబెట్టిన విషయం విదితమే. 2016, జనవరి 20న బచఖాన్ యూనివర్సిటీలో ముష్కరులు కాల్పులు జరపడంతో 21 మంది(విద్యార్థులు, స్టాఫ్) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com