ఇన్ఫోసిస్‌ కొత్త సీఈవోగా సలీల్‌ పరేఖ్‌

- December 02, 2017 , by Maagulf
ఇన్ఫోసిస్‌ కొత్త సీఈవోగా సలీల్‌ పరేఖ్‌

బెంగళూరు: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ ఎట్టకేలకు కొత్త సీఈవో పేరును ప్రకటించింది. క్యాప్‌జెమినీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సలీల్‌ పరేఖ్‌ను సీఈవోగా నియమించినట్లు సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. పరేఖ్‌ క్యాప్‌జెమినీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఇన్ఫోసిస్‌ నియామక ప్రకటన చేయడం గమనార్హం.

పరేఖ్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ సర్వీసెస్‌ కంపెనీ క్యాప్‌జెమినీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఆయన సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు క్యాప్‌జెమినీ శనివారం ప్రకటించింది. 2018, జనవరి 1 వరకు పరేఖ్‌ క్యాప్‌జెమినీలో కొనసాగుతారు. జనవరి 2న ఇన్ఫోసిస్‌ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. పరేఖ్‌.. బాంబే ఐఐటీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. కార్నెల్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చదివారు.

'ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీగా సలీల్‌ పరేఖ్‌ను కంపెనీలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పరేఖ్‌ నేతృత్వంలో ఇన్ఫోసిస్‌ మరింత ముందుకెళ్తుందని బోర్డు విశ్వసిస్తుంది' అని బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని తెలిపారు.

కంపెనీ వ్యవస్థాపకులతో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో విశాల్‌ సిక్కా ఇన్ఫోసిస్‌ సీఈవో పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న యూబీ ప్రవీణ్‌ రావుకు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పగించారు. జనవరి 2న ప్రవీణ్‌ రావు సీఈవో పదవి నుంచి వైదొలిగి పూర్తిస్థాయి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను కొనసాగిస్తారని కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com