మోడీ పై అస్త్రాలు సంధించిన మన్మోహన్
- December 03, 2017
సహజంగా బహిరంగ సభలు, మీడియాకు, పార్టీ నేతలకు దూరంగా ఉండి తన పని తాను చేసుకుపోతున్నట్లుగా ఉండే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆసక్తికరమైన రీతిలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పాల్గొనడమే కాకుండా తన సహజశైలికి పూర్తి భిన్నంగా పక్కా రాజకీయవేత్తవలే ప్రసంగాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాకాలోని ఎన్నిక హీట్‌ను మరింత పెంచుతూ.సూరత్‌లో జరిగిన వ్యాపారుల సమావేశంలో మన్మోహన్ మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోట్లరద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశానికి సంభవించిన రెండు భారీ విపత్తులని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల కారణంగా చైనా లబ్ధి పొందుతున్నట్టు కనిపిస్తుందని చెప్పారు.
నోట్ల రద్దు, జీఎస్టీలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, దీంతో ఉత్పత్తి పడిపోయిందని మన్మోహన్ సింగ్ చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ పారిశ్రామిక రంగం ఉత్పత్తి చేయలేకపోవడంతో ఆ లోటును చైనా భర్తీ చేస్తూ లాభపడుతోందని మన్మోహన్ వివరించారు. 2016 17లో చైనా నుంచి దిగుమతుల విలువ రూ. 1.96 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.41 లక్షల కోట్లకు చేరిందన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రూ.45 వేల కోట్ల దిగుమతులు పెరుగడం (23 శాతం వృద్ధి) అసాధారణమని వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆదరాబాదరాగా అమలులోకి తెచ్చారని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ పేరుతో ప్రధాని మోడీ ప్రజలందరిపైనా దొంగలన్న ముద్ర వేశారని, కానీ నల్ల కుబేరులు సురక్షితంగా బయటపడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేసిన ఈ చారిత్రక తప్పిదం నుండి గుణపాఠాలు తీసుకోకపోవడం మరింత విషాదకరం అని అన్నారు.
నోట్ల రద్దువల్ల నష్టపోయిన పేదలు, చిన్న రైతులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఉపశమనం కలిగించాలని తాను పార్లమెంట్‌లో ప్రభుత్వానికి సూచిస్తే.. ప్రభుత్వం దానికి బదులు వారిపై జీఎస్టీని తెచ్చిపెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం సృష్టించిన రెండు విపత్తులు చిన్న, మధ్య తరహా సంస్థలను తీవ్రంగా దెబ్బతీశాయని మాజీ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతటిపై కూడా వాటి ప్రభావం ప్రతికూలంగానే ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేద కుటుంబం నుండి వచ్చానని ప్రధాని మోడీ తరచూ చేసే వ్యాఖ్యలను మన్మోహన్ పరోక్షంగా తిప్పికొడుతూ, తనకు సానుభూతి అవసరం లేదన్నారు. `నా పేదరికం నేపథ్యాన్ని బట్టి దేశం నాపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను ప్రధాని మోడీజీతో పోటీ పడాలనుకోవడం లేదు` అని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా వ్యాపారులు ఏడాది కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
శిశు మరణాల నుంచి మహిళా అక్షరాస్యత వరకు ప్రతి సామాజిక సూచీలోనూ దేశంలోనే ఉత్తమ రాష్ర్టాలుగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల కంటే గుజరాత్ వెనుకబడి ఉన్నదని మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతి కోసం కలిసి పని చేస్తే, ప్రధాని మోడీ తన ప్రయోజనాల కోసం వారిద్దరిని విడదీయడం వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బ తింటుందన్నారు. గుజరాత్‌లో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రతి సామాజిక వర్గం ఆందోళన చెందుతుందని, తాము అధికారంలోకి వస్తే ప్రతి గుజరాతీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కనుక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మన్మోహన్ సింగ్ కోరారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







