అనంతపురంలో కొరియన్‌ సిటీ

- December 04, 2017 , by Maagulf
అనంతపురంలో కొరియన్‌ సిటీ

ఆంధ్రప్రదేశ్‌ను రెండో రాజధానిగా భావించి పెట్టుబడులు పెడితే, అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కియా అనుబంధ సంస్థల ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. దక్షిణ కొరియాలో సిఎం బృందం పర్యటనలో భాగంగా తొలిరోజు సోమవారం తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపిలో పారిశ్రామికాభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులతో సిఎం అన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో అనంతపురంలో కొరియన్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కియా మోటార్స్‌ స్ఫూర్తితో ఏపిలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపిలో వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ' లుక్‌ ఈస్ట్‌ ' పాలసీని ఏపి సాకారం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కియా సంస్థల ప్రతినిధుల సందేహాల్ని ఆయన నివృత్తి చేశారు. ఏపిలో తమ పెట్టుబడులపై ఆ సంస్థల ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈమేరకు కియా అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో రూ 4,995.20 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మొత్తం 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఏపి ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ( ఏపిఇడిబి ) ' లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ ' తీసుకుంది. ఒప్పందాల విలువ రూ 3000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అనంతరం ముఖ్యమంత్రి బృందం కియా మోటార్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించింది. కియా మెటార్స్‌ ఎలక్ట్రికల్‌ కార్లను కూడా తయారు చేస్తుందని ఆ సంస్థ సిఇఒ హ్యాంగ్‌ కున్‌ లీ తెలిపారు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 170 కిలోమీటర్ల వరకు నడిచే సామర్ధ్యంతో వీటిని తయారు చేశామని వివరించారు. అమరావతిలో వందశాతం ఎలక్ట్రిక్‌ వాహనాలు నడపాలని నిర్ణయించామని సిఎం ఈ సందర్భంగా లీ కు తెలిపారు. కియా మోటార్స్‌తో మాట్లాడి కిలోమీటర్‌కు ఎంత ఖర్చవుతుందో స్పష్టంగా తెలుసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
దాసన్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ నామ్‌ మెయిన్‌ వూ తో సిఎం చర్చలు జరిపారు. భారీ పెట్టుబడులతో ఏపికి రావాలని నామ్‌ను కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా నామ్‌ను ఆహ్వానించారు. 

ఏపితో కలిసి పనిచేసేందుకు లొట్టే కార్పొరేషన్‌ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సంయుక్త కార్యసాధన బృందం ఏర్పాటు కానుంది. ఆ సంస్థ ప్రెసిడెంట్‌, సిఇఒ వాన్గ్‌ కాగ్‌ జు తో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్‌, కోల్డ్‌ చెయిన్‌, హోటళ్లు, గోల్ఫ్‌ కోర్సు తదితర 90కు పైగా బిజినెస్‌ యూనిట్లను నెలకొల్పానని సిఎంకు కాగ్‌కు తెలిపారు.

దక్షిణ కొరియా - భారత్‌ మధ్య 10 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయ ఒప్పందంలో భాగంగా అనంతపురంలో ' లోకల్‌ ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ ' ఏర్పాటు కానుంది. ఈమేరకు బిటిఎస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎమ్‌డి ప్రొఫెసర్‌ వై కిమ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ, ఇడిబిలకు తగిన ప్రతిపాదనలు అందించాల్సిందిగా సంస్థ ప్రతినిధుల్ని ఆయన కోరారు. ఐరిటెక్‌ కంపెనీ సిఇఒ కిమ్‌ డెహోన్‌, హేన్సోల్‌ కెమికల్స్‌, గ్రాన్‌ సియోల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, డౌన్‌ స్ట్రీమ్‌ పెట్రో కెమికల్స్‌ ఇండిస్టీ, పోస్కో దేవూ, హ్యో సంగ్‌ తదితర సంస్థల ప్రతినిధులతో తొలిరోజు పర్యటనలో భాగంగా సమావేశమైన చంద్రబాబు ఏపిలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. మంత్రులు యనమల, అమర్నాథ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఇడిబి, ఏపిఐఐసి అధికారులు సిఎం బృందంలో ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com