ప్రశ్నించేందుకు వస్తున్న జనసేన నాయకుడు

- December 05, 2017 , by Maagulf
ప్రశ్నించేందుకు వస్తున్న జనసేన నాయకుడు

ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పలు ప్రజా సమస్యలపై గళం వినిపించిన సంగతి తెలిసిందే. బాధితుల పక్షాన నిలిచి ప్రభుత్వాల్లో కదలిక తీసుకొచ్చారు. సామాజిక సమస్యల పరిష్కారంలోనూ చొరవ చూపుతున్నారు. ఏపీ రాజధాని రైతుల సమస్య, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల వేదన, సమస్యల సుడిగుండంలో ఉన్న నేతన్నలు.. ఇలా.. ఎవరు కష్టాల్లో ఉన్నా వారి పక్షాన నిలిచి సమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ కృషి చేశారు. సామాజిక సమస్యల పరిష్కారంలో జనసేనాని చూపుతున్న చొరవ, సుసంపన్నమైన సమాజ స్థాపన కోసం పవన్ చేస్తున్న కృషికి గాను అంతర్జాతీయ పురస్కారం కూడా ఆయనను వరించింది.
తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి జనంలోకి వెళ్తున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆయన జనంలో ఉండనున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాలు ఆయన విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (డిసిఐ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పనున్నారు. అలాగే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత 9వ తేదీన ఒంగోలులో పర్యటిస్తారు. అక్కడ ఇటీవల కృష్ణా నదిలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. మూడు రోజులు ఉత్తరాంధ్రలో, ఓ రోజు ఒంగోలులో పవన్ పర్యటిస్తారు.
కాగా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (డిసిఐ) పూర్తిగా ప్రైవేటీకరించాలని కేంద్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం విశాఖ సాగర తీరాన ప్రకంపనలు పుట్టించింది. డీసీఐ ప్రైవేటీకరణపై మనస్తాపానికి గురై, అందులో పనిచేస్తున్న వెంకటేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. డీసీఐలో 2012లో హెచ్‌ ఆర్ డిపార్ట్ మెంట్‌ లో అసిస్టెంట్‌ గా వెంకటేష్ విధుల్లో చేరాడు. డీసీఐ ప్రైవేటీకరణను నిరసిస్తూ సంస్థ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో నవంబర్ 30వ తేదీన వెంకటేష్ పాల్గొన్నాడు. డీసీఐ మూసేస్తే తన భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనతో వెంకటేష్ మానసికంగా కుంగిపోయాడు. డీసీఐ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని ఎంపీ హరిబాబును కలిసినప్పుడు ఆయన ప్రైవేటీకరణను ఆపలేమని చెప్పడంతో వెంకటేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తను అప్పుల్లో ఉన్నానని, డీసీఐ ప్రైవేటీకరిస్తే, తన కుటుంబం రోడ్డున పడుతుందని వెంకటేష్ సూసైడ్ నోట్‌ లో పేర్కొన్నాడు. తన చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, కంపెనీని ప్రైవేటుపరం చేయవద్దని వెంకటేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com