రష్యాలో జనవరి 11 నుంచి 'బాహుబలి 2 '

- December 26, 2017 , by Maagulf
రష్యాలో జనవరి 11 నుంచి 'బాహుబలి 2 '

దర్శక ధీరుడు రాజమౌళి దృశ్యకావ్యం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం బాహుబలి-2. నాడు రూ. 1500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి ఇప్పుడు జపాన్ భాషలో అనువదిస్తున్న విషయం తెలిసిందే. 2017లో భారత్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు మరిన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. జనవరి 2018లో ఈ చిత్రంలో రష్యాలో విడుదలకాబోతోందని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. అంతేకాకుండా బాహుబలి 2 రష్యన్ భాష ట్రైలర్‌ను కూడా ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం డిసెంబర్ 29న జపనీస్ భాషలో విడుదల కావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

చైనాలోనూ బాహుబలి సినిమాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ సినిమా జపాన్ లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి జపాన్ సెన్సార్ బోర్డు 'జి' సర్టిఫికెట్ జారీచేసింది. జి సర్టిఫికెట్ అంటే ఫ్యామిలీ తో చూడదగ్గ చిత్రం.

ఇప్పటికే తన పేరు మీద కొత్త కొత్త రికార్డులను నమోదు చేసుకున్న 'బాహుబలి 2', రష్యన్‌, జపనీస్ భాషల్లో కూడా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు బాహుబలి 2 తీసుకెళ్లిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com