సౌదీ కష్టాల నుంచి విముక్తి చెందిన మహిళలు

- January 05, 2018 , by Maagulf
సౌదీ కష్టాల నుంచి విముక్తి చెందిన మహిళలు

హైదరాబాద్:క్షేమంగా నగరానికి చేరుకున్న ఇద్దరు మహిళలు.నగరం నుంచి సౌదీకి ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు విదేశాంగ శాఖ చొరవతో ఎట్టకేలకు ఇక్కడకు చేరుకున్నారు. వివరాలను ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ తెలిపారు. టోలీచౌక్‌ హకీంపేట్‌కు చెందిన నసీంబేగం నగరంలోని ఓ ఏజెంట్‌ ద్వారా రెండున్నర ఏళ్ల క్రితం సౌదీకి ఉద్యోగానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగం బదులు ఓ ఇంట్లో పని మనిషిగా చేర్చారు. వేతనం ఇవ్వకపోవడంతోపాటు అనేక కష్టాలు ఆమె ఎదుర్కొన్నారు. శామీర్‌పేటకు బాలాజీనగర్‌కు చెందిన నుజ్జత్‌బేగంది కూడా ఇదే వ్యథ. అక్కడి ఆసుపత్రిలో ఉద్యోగానికని ఏజెంట్‌ ఆమెను పంపించారు. తీరా ఓ ఇంట్లో పని మనిషిగా చేయాల్సి వచ్చింది. గతయేడాది ఆగస్టు నుంచి సౌదీలోని ఆభాలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఈ ఇద్దరు మహిళల కష్టాలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి ఎంబీటీ నేత తీసుకువెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ రియాద్‌లో ఉన్న అధికారులకు వివరాలను అందించి బాధితులు స్వదేశానికి వచ్చేలా సహాయపడింది. ఈ సందర్భంగా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

తమలాంటి వారెందరో ఉద్యోగాల నిమిత్తం వెళ్లి ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. జవహర్‌నగర్‌ ఠాణాలో ఏజెంట్‌పై ఫిర్యాదు చేసినట్లు నుజ్జత్‌బేగం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com