గల్ఫ్ వెళ్లేవారికి నైపుణ్య శిక్షణ: డా.రవికుమార్ వేమూరు
- January 06, 2018
గల్ఫ్ వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్..
రాష్ట్రంలో 3 కేంద్రాలు ఏర్పాటు..
ఏటా 24 వేల మందికి తర్ఫీదు
యూఏఈతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
బాధితులకు ఏపీఎన్‌ఆర్‌టీ సాయం
అమరావతి:గల్ఫ్‌లో ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు తగిన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో మూడు అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ఏటా 24 వేల మందికి శిక్షణ ఇస్తారు. మొదటిది రాజధాని అమరావతిలో ఏర్పాటుకానుంది. దీనికోసం రూ.4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఏప్రిల్ నాటికి కేంద్రం ఏర్పాటు, శిక్షణ ప్రారంభిస్తారు. గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్లే రాయలసీమ ప్రాంతంలోని కడప, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో ఏటా 8 వేల మందికి శిక్షణ ఇస్తారు. ఏపీఎన్‌ఆర్‌టీ వీటిని నిర్వహిస్తుంది. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా, అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడకుండా, వెనక్కి వచ్చే దారిలేక సతమతం అవ్వకుండా ఏపీకి-యూఏఈకి మధ్య ఒప్పందం కుదిరింది. సొంతంగా యూఏఈకి వెళ్లేందుకు ఎంపికైనా...వారికి కూడా తగిన శిక్షణ ఇస్తారు. గల్ఫ్‌లో మెకానిక్‌లు, ప్లంబర్లు, ఎలక్ర్టీషియన్లు, తాపీమేస్త్రిలు, రాడ్ బెండింగ్ వర్కర్లకు డిమాండ్ ఉంది. ఒక్కోసారి తగిన నైపుణ్యం లేకపోవడం వల్ల అనుకున్నంత జీతాలు ఇవ్వడం లేదు. సరైన శిక్షణ, నైపుణ్యంతో వెళ్తే మామూలుగా ఇచ్చే జీతం కంటే 10-20శాతం ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని ఇటీవల గల్ఫ్ దేశాలకు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రెసిడెంట్ డా.రవికుమార్ వేమూరు వెళ్లినప్పుడు అక్కడి కంపెనీలే చెప్పాయి.
ప్రవాసులకు ప్రమాద బీమా!
ప్రవాసాంధ్రులకు ఏపీఎన్‌ఆర్‌టీ బీమా కల్పించనుంది. ఇటీవల ప్రకటించిన ప్రవాసుల సంక్షేమం, అభివృద్ధి విధానం కింద, ఇందుకు అవసరమైన రూ.25 కోట్లను ప్రభుత్వం శుక్రవారం మంజూరు చేసింది. గల్ఫ్ దేశాలే కాకుండా సింగపూర్, మలేషియాలకు వెళ్లి చిరు ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రవాసులకు, అమెరికా వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకూ బీమా కల్పిస్తామని ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ రవికుమార్ తెలిపారు. మూడేళ్లపాటు బీమాకు అవసరమైన ప్రీమియం రూ.225ను ఏపీఎన్‌ఆర్‌టీ చెల్లిస్తుంది. లబ్ధిదారు మూడేళ్లకు కలిపి రూ.150 చెల్లిస్తే చాలు. ఈ పథకం కింద లీగల్ బీమా, ఆరోగ్య బీమా, డెత్ బెనిఫిట్‌లు ఉంటాయి. ఏజెంట్లు, కాంట్రాక్టర్లు ఉద్యోగాల పేరిట ఎవరినైనా గల్ఫ్‌కు తీసుకెళ్లి మోసం చేసిన సందర్భాల్లో...అక్కడి భారతీయ ఎంబసీ సర్టిఫై చేస్తే వెంటనే బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతను ఏపీఎన్‌ఆర్‌టీ తీసుకుంటుంది. ప్రయాణ ఖర్చులను భరిస్తుంది. అత్యవసర సహాయం కింద రూ.25 వేల వరకు సాయం చేస్తుంది. న్యాయపరంగా అండగా ఉంటుంది. ఈ మొత్తాన్ని మళ్లీ లీగల్ బీమా నుంచి ఏపీఎన్‌ఆర్‌టీ తీసుకుంటుంది. లక్ష వరకు ఆరోగ్య బీమా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చనిపోతే రూ.10 లక్షల బీమా మొత్తాన్ని వారి కుటుంబసభ్యులకు అందిస్తారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







