చంద్రబాబునాయుడుకు ఎట్టకేలకు మోదీ అపాయింట్‌మెంట్..!
- January 06, 2018
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. ఈనెల 12న ఇద్దరూ భేటీ కానున్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే నెల 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో.. హామీల సాధన కోసం చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రయత్నించనున్నారు.
చాలా కాలం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీ భేటీ కాబోతున్నారు. ఈనెల 12న ప్రధానితో జరిగే సమావేశంలో... ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై చర్చించనున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే... హామీల సాధన కోసం చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రయత్నించనున్నారు.
రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా.. కేంద్రమిచ్చిన హామీలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తే.. ఇబ్బందికర పరిస్థితి తప్పదని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవల టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో పెండింగ్ అంశాలు పరిష్కరించాలని... టీడీపీ ఎంపీల ద్వారా ముఖ్యమంత్రి నివేదిక పంపారు. ఎంపీలతో కొద్దిసేపే సమావేశమైనా... ఏపీని సొంత రాష్ట్రంలా భావించి ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లో తాను చంద్రబాబుతో సమావేశమవుతానని.. పెండింగ్ అంశాలను పరిష్కరిస్తామని.. ఎంపీలకు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ వివరాలను కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా తెలుసుకున్న చంద్రబాబు... స్వయంగా తానే హస్తిన పర్యటనకు వెళ్లి ప్రధానితో మాట్లాడేందుకు సన్నద్ధమయ్యారు. ప్రత్యేక హోదా రాక.. ప్రత్యేక ప్యాకేజీ అమలుకాక రాష్ట్రం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కానున్నందున.. ఏపీకి ఇచ్చే ప్రాధాన్యత ఎంతో తేలనుంది. రాజధాని నిర్మాణానికి...పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్, అసెంబ్లీ సీట్ల పెంపు తదితర అంశాలపై చర్చించేందుకు... ప్రధానితో పాటు కేంద్రం ఆర్థిక మంత్రి జైట్లీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలను ముఖ్యమంత్రి కలవనున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనా.. సప్లిమెంటరీ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ కింద మార్పులు, చేర్పులు చేసే అవకాశమున్నందున ప్రధానితో సీఎం భేటీ ఎంతో కీలకం కానుంది. ఇప్పటివరకు ఇచ్చిందెంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత... ఎన్నికలకు వెళ్లేముందు రాష్ట్రానికి ఇంకా ఏం కావాలో చంద్రబాబు కేంద్రానికి స్పష్టంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!