ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ బిజీ బిజీ..

- January 09, 2018 , by Maagulf
ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ బిజీ బిజీ..

ఢిల్లీ పర్యటనలో గవర్నర్ నరసింహన్ బిజీబిజీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక అంశాలపై ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చారు.  విభజన సమస్యలపైనా నరసింహన్ చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌.... రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రితో భేటీ అయ్యారు. మొదట హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌‌తో భేటీ అయిన గవర్నర్... తెలుగు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. విభజన సమస్యలపై రాష్ట్రంలోని పార్టీల అభ్యంతరాలను కేంద్రానికి వివరించారు. రాజ్‌నాథ్‌తో తన భేటీ సర్వసాధారణమైనదని... సమావేశం అనంతరం నరసింహన్ ‌తెలిపారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధల్లాంటివి... వీలైనంత త్వరగా అవి సర్దుకుంటాయన్నారు. విభజన చట్టంలో కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజ్ భవన్ పనితీరును మరింత మెరుగు పరిచి ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో నరసింహన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు... గవర్నర్ల విధులు, అధికారాలపై ఏర్పాటైన సబ్ కమిటీ నివేదికను రాష్ట్రపతికి అందజేశారు. గవర్నర్ పదవిని ప్రజలకు మరింత చేరువచేయడం.. పరిపాలనా అంశాల్లో రాజ్ భవన్ల పరిధిని, జవాబుదారీతనాన్ని పెంచడం.. వారి జీతభత్యాలు తదితర అంశాలపై ఈ నివేదికలో పొందుపరిచారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన నరసింహన్‌...  తెలుగురాష్ట్రాల్లో రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితులను వివరించారు. ఇటీవల తెలంగాణా కాంగ్రెస్ నేతల ఆగ్రహంపై కూడా గవర్నర్ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో  పేర్కొన్న హామీల అమలుతీరు, వాటిపై ఇరురాష్ట్రాల ప్రభుత్వాల స్పందనలను మోడీకి వివరించారు.  హైకోర్టు విభజనపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలంగా వున్నాయని గవర్నర్‌ వెల్లడించారు. అలాగే  నియోజక వర్గాల పునర్విభజన పై రెండు రాష్ట్రాల అధికార పార్టీలు రానున్న బడ్జెట్ సమావేశాల్లో పట్టుబట్టే అవకాశముందని నరసింహన్‌ మోడీకి వివరించినట్లుగా తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com