జై జవాన్.....జై కిసాన్....అన్న లాల్ బహదూర్ గారి వర్ధంతి నేడు

- January 10, 2018 , by Maagulf
జై జవాన్.....జై కిసాన్....అన్న లాల్ బహదూర్ గారి వర్ధంతి నేడు

లాల్ బహదూర్ శాస్త్రి భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి. మన దేశ రెండవ ప్రధాన మంత్రి.. ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని మొగల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. బతకలేక బడిపంతులు అనుకొనే ఆరోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి శారదాప్రసాద్ ఒక బడిపంతులు.. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఆ తల్లిదండ్రులకు ప్రాణం.. కానీ ఆయన పుట్టిన ఏడాదిన్నరకే తండ్రి మరణించడంతో లాల్ బహదూర్ శాస్త్రి తాతగారు ఆదుకొని ఆశ్రయం ఇచ్చారు. ఎంతో భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ గారు ఉపాధ్యాయుల ప్రేమాభిమానలను అందుకొన్నాడు. స్కూల్ కు ప్రతి రోజూ గంగానది దాటి వెళ్లడానికి డబ్బులు లేక .. ఆత్మాభిమానం కల ఆయన తన బట్టలను విప్పి, వారిలో పుస్తకాలను చుట్టి మూటలా కత్తి తన వీపునకు తగిలించుకుని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈదుకొంటూ స్కూల్ కు వెళ్ళేవాడు.. గాంధీ పిలుపుని అందుకొన్న లాల్ బహదూర్ తన చదువుకు స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరి అనేక సార్లు జైలు జీవితం అనుభవించాడు. అనంతరం కాశీలోని వైద్య పీఠం లో అద్యాయనం చేసి శాస్త్రి అనే పట్టాను అందుకొని అప్పటి నుంచి లాల్ బహదూర్ శాస్త్రి అయ్యారు.  ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ఉత్తమ నాయకుడిగా పేరుపొందిన ఆయన స్వాతంత్ర్యయ ఉద్యమ సమయంలో అనేక కీలకమైన పాత్రలను వహించాడు. శాస్త్రి రైల్వే మంత్రి గా ఉన్న సమయంలో 1956 లో "అరియలూరు" లో రైలు ప్రమాదం చోటు చేసుకోగా తన పదవీ నిర్వహణ కాలంలో ఈ సంఘటన జరిగింది కనుక తాను నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వర్గం నుంచి తప్పుకొన్న ఆదర్శప్రాయుడు. 1964 లో నెహ్రూ మరణాంతరం ప్రధాన మంత్రి పదవిని చేపట్టి.. తనకు తానే సాటి అని నిరూపించుకొన్న ప్రతిభాశాలి. ప్రధానిగా రష్యా పర్యటన సమయంలో ఆయన వేషధారణ చూసి రష్యావారు ఆశ్చర్య పడ్డారట. కాగా లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందం చేసుకున్న మర్నాడే అంటే జనవరి 11, 1966 న మృతి చెందారు. ఆయన గుండెపోటు వల్ల మరణించారని రష్యా ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అనేక సందేహాలున్నాయి. విషప్రయోగం వల్లనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.. లాల్ బహదూర్ శాస్త్రి గారికి భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం మరణానతరం 1966 లో ప్రకటించింది. జై జవాన్.....జై కిసాన్....అని నినదించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా నివాళి ఆర్పిస్తూ.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com