సౌదీ అరేబియా:25 ఏళ్లు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చు

- January 13, 2018 , by Maagulf
సౌదీ అరేబియా:25 ఏళ్లు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చు

సౌదీ అరేబియా:ఇన్నిరోజులు సౌదీ అరేబియాను సందర్శించాలంటే మహిళలకు కచ్చితంగా పక్కన ఓ తోడు ఉండాలి. లేదంటే ఆ దేశం టూరిస్ట్‌ వీసానే జారీచేయదు. కానీ ప్రస్తుతం 25 సంవత్సరాలు, ఆపైబడిన మహిళలు ఇక ఒంటరిగా టూరిస్ట్‌ వీసాపై సౌదీ అరేబియాను సందర్శించవచ్చట. ఈ విషయాన్ని సౌదీ కమిషన్‌ ఫర్‌ టూరిజం, నేషనల్‌ హెరిటేజ్‌ అధికార ప్రతినిధి చెప్పారు. కుటుంబ సభ్యులు లేదా ఎలాంటి సహచరులు అవసరం లేకుండానే మహిళలు సౌదీ అరేబియా సందర్శించే స్వేచ్ఛను తాము కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలు మాత్రం సౌదీ అరేబియాకి ప్రయాణించాలంటే కచ్చితంగా కుటుంబసభ్యులు లేదా సహచరులు అవసరమని తెలిపారు. 

''టూరిస్ట్‌ వీసా అనేది సింగిల్‌-ఎంట్రీ వీసా. గరిష్టంగా 30 రోజులు వాలిడ్‌లో ఉంటుంది. ఇది వర్క్‌, విజిట్‌, హజ్, ఉమ్రా వీసాలు నుండి స్వతంత్రంగా ఉంటుంది'' అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ది కమిషన్స్‌ లైసెన్సింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉమర్‌ అల్‌-ముబారక్‌ తెలిపారు.  టూరిస్ట్‌ వీసాలకు సంబంధించిన నిబంధనలు తుది రూపకల్పన జరిగాయని, ఈ నిబంధనలను 2018 తొలి క్వార్టర్‌లో ప్రకటించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర సమాచార సెంటర్‌, విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కలిసి టూరిస్ట్‌ వీసాల జారీ కోసం ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ను కమిషన్‌ ఐటీ డిపార్ట్‌మెంట్‌ అభివృద్ధి చేస్తుందని అల్‌-ముబాకర్‌ తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా ముస్లింలతో పాటు సాధారణ మహిళలు కూడా సౌదీలో పర్యటించాలంటే భర్త లేదా సహచరులు అవసరం ఉండేది. ఇదే రకమైన నిబంధనను ప్రపంచంలో చాలా మతాల వారు అనుసరిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com