సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించబోతున్న మొట్టమొదటి మహిళ సీతారామన్

- January 17, 2018 , by Maagulf

న్యూఢిల్లీ: సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం నిర్మల సుఖోయ్ ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించనున్నారు.

రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నించి నిర్మలా సీతారామన్ ఆ పదవికే వన్నె తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. డోక్లాం వివాద సమయంలో కూడా అత్యంత చొరవ తీసుకుని ఆమె భారత-చైనా సరిహద్దుల్లో స్వయంగా పర్యటించారు.

త్రివిధ దళాలపై స్వయం పరిశీలన... 
త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలు స్వయంగా పరిశీలిస్తూ...
ఈ నెల ప్రారంభంలో భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను కూడా రక్షణ మంత్రి పరిశీలించారు. నౌకాదళానికి చెందిన దేశవాళీ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా, విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలోకి ప్రవేశించిన నిర్మలా సీతారామన్ వాటి శక్తి సామర్థ్యాలు, పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. తాజాగా భారతీయ వాయుసేన శక్తి సామర్థ్యాలను కూడా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పరిశీలించనున్నారు. అందులో భాగంగానే బుధవారం యుద్ధ విమానం సుఖోయ్‌లో ఆమె ప్రయాణించనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఇదీ సుఖోయ్ శక్తి సామర్థ్యాలు... 
అణు సామర్థ్యం కలిగిన యుద్ధవిమానం...
భారత వాయుసేనలో అత్యంత ప్రాధాన్యం కలిగిన, శక్తిమంతమైన దేశవాళీ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్‌యు-30 ఎంకేఐ. ఇది రష్యా గతంలో మనకు సరఫరా చేసిన సుఖోయ్ ఎస్‌యు-30 యుద్ధవిమానానికి అత్యాధునిక రూపం. హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) తయారు చేసిన ఈ యుద్ధ విమానం అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే, దుర్బేధ్యమైన శత్రుభూభాగంలోకి కూడా చొచ్చుకుపోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2004లో భారత వాయుసేన తన అమ్ములపొదిలో ఈ దేశవాళీ యుద్ధ విమానాన్ని చేర్చుకుంది. ప్రస్తుతం భారత వాయుసేనలో 11 సుఖోయ్ యుద్ధవిమాన స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. ఈ త్వరలోనే మరో రెండు సుఖోయ్ యుద్ధవిమాన స్క్వాడ్రన్‌లను ఐఎఎఫ్ తన వాయుసేనలో చేర్చుకోనుంది.

బ్రహ్మోస్ ప్రయోగం కూడా... 
సుఖోయ్ నుంచి విజయవంతంగా...
ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను గగనతలం నుంచి ఇటీవలే పరీక్షించిన భారత వాయుసేన ఇందుకు కూడా సుఖోయ్ ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాన్నే ఎంచుకుంది. సుఖోయ్ యుద్ధవిమానం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా.. అది నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో శత్రుదేశాల నౌకలను నిమిషాల వ్యవధిలోనే నాశనం చేయగల సత్తా భారత రక్షణ వ్యవస్థకు లభించినట్టయింది. 205 టన్నుల బరువుండే బ్రహ్మోస్‌ క్షిపణిని ఇంతకు ముందు సముద్రం, ఉపరితలం నుంచే పరీక్షించగా, తాజాగా సుఖోయ్ యుద్ధవిమానం కూడా ఈ క్షిపణిని అలవోకగా మోసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించడంలో తోడ్పడింది.
 
గతంలో పలువురు... 
గతంలో ఎవరెవరు ప్రయాణించారంటే...
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కంటే ముందు పలువురు ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన జార్జి ఫెర్నాండజ్, మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఈ సుఖోయ్ ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అయితే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. రక్షణ మంత్రి హోదాలో.. అందులోనూ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించబోతున్న మొట్టమొదటి మహిళ సీతారామన్ కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com