గన్నవరం- ముంబయి విమానసేవలు ప్రారంభం
- January 18, 2018
రాజధాని వాసుల కల నెరవేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి విజయవాడ నుంచి నేరుగా రెండు గంటల్లో చేరిపోయేందుకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. గన్నవరం నుంచి ముంబయికి విమాన సేవలను కేంద్రం పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అమరావతి రాజధాని ప్రాంతం నుంచి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోయింగ్ 737-800 విమాన సేవలను ప్రారంభించింది. ముంబయికి చేరుకుంటే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా వెళ్లిపోయేందుకు అనుసంధానం ఉంటుంది. ఇదే సర్వీసును భవిష్యత్తులో దుబాయ్‌కు పొడిగించే యోచనలో ఎయిరిండియా ఉంది.
ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ విభాగాల ఏర్పాటు తుది దశకు చేరింది. గన్నవరం విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో ఈ రెండు విభాగాలకు అవసరమైన యంత్ర పరికరాలు, అంతర్జాతీయ అనుసంధానం కోసం అంతర్జాల కేబుళ్లను వేసే పని జరుగుతోంది. ఇది పూర్తయ్యాక.. ముంబయి సర్వీసు దుబాయ్‌కు ఎగరనుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటోంది. వీరందరికీ ఈ ముంబయి సర్వీసుతో ప్రయోజనం చేకూరనుంది. భారతదేశానికే గేట్‌వే లాంటి మహానగరం ముంబయి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకూ గంటకో విమాన సర్వీసు ఉంటుంది. విజయవాడ నుంచి నేరుగా ముంబయి విమానాశ్రయంలో దిగిపోతే.. అక్కడి నుంచి కనెక్టివిటీ విమాన సర్వీసును అందుకుని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లిపోయేందుకు మార్గం సుగమం అవుతుంది.
హాట్‌కేకుల్లా టిక్కెట్లు..
తొలి సర్వీసు ప్రారంభించగానే గురువారం మధ్యాహ్నానికే వంద మందికి పైగా టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. టిక్కెట్ ప్రారంభ ధర రూ.4500 నుంచి మొదలై.. గురువారం రాత్రికి రూ.8 వేల వరకూ చేరింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్ర, ఆది వారాలతో పాటు మంగళవారం కలిపి మూడు రోజులు ప్రస్తుతానికి ఈ సర్వీసు నడుస్తుంది. ఈ మూడు రోజుల్లో ఆక్యుపెన్షీ నిండిపోతే.. నిత్యం నడపాలనేది ఎయిరిండియా ప్రణాళిక. ప్రస్తుతం విజయవాడ నుంచి ముంబయికి రైలులో వెళ్లేందుకు 20 గంటలు, బస్సుల్లో వెళ్లేందుకు 19గంటలకు పైగా సమయం పడుతోంది. విమాన సర్వీసు అందుబాటులోనికి రావడంతో కేవలం 1.45గంటల్లో చేరుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ముంబయి సర్వీసుతో పాటూ దేశంలోని దిల్లీ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై మహా నగరాలకు గన్నవరం నుంచి అనుసంధానం ఏర్పడింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







