అంకితభావంతో పని చేసే యువకులకు పార్టీలో అవకాశం ఇస్తానంటున్న రజనీకాంత్

- January 21, 2018 , by Maagulf
అంకితభావంతో పని చేసే యువకులకు పార్టీలో అవకాశం ఇస్తానంటున్న రజనీకాంత్

చెన్నై: రాజకీయ పార్టీని ప్రారంభించటానికి ముందుగా తన అభిమాన సంఘాలను పటిష్టపరిచే దిశగా రజనీకాంత్‌ చర్యలు ప్రారంభించారు. ఇటీవల తన అభిమాన సంఘాలన్నింటినీ కలిపేలా మక్కళ్‌ మండ్రంపేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

తనకు మద్దతు ఇచ్చేవారంతా ఆ వెబ్‌సెట్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చునని రజనీ విజ్ఞప్తి చేశారు. తమిళనాట నవశకాన్ని ఆవిష్కరించేందుకు తన మక్కల్ మండ్రంను పటిష్ట పరచి, గ్రామీణ స్థాయి నుంచి ప్రజల అభిమానాన్ని పొందాలని రజనీ భావిస్తున్నారు. ఆ దిశగా లైకా సంస్థలో పని చేసిన రాజు మహాలింగం రజనీ మక్కల్ మాండ్రం సాంకేతిక బృందం ఇంచార్జిగా నియమితులయ్యారు.

రాజు మహాలింగం వేలూరులోని రజనీ అభిమాన సంఘాల నిర్వాహకులతో మాట్లాడారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల స్థాయి నుంచి పార్టీకి చక్కగా పనిచేసే నిర్వాహకులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక తరచూ జిల్లా స్థాయిల్లో అభిమాన సంఘాల సమావేశాలు జరగుతాయన్నారు.

ప్రతి నియోజక వర్గంలోనూ 20 శాతం మంది ఓటర్లను రజనీ మక్కల్‌మండ్రం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. రజనీ ప్రారంభించనున్న కొత్త పార్టీకి అంకిత భావంతో పనిచేసే మెరికల్లాంటి యువకులకు ఇందులో సభ్యత్వం కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, తమిళ కొత్త సంవత్సరం నాడు రజనీకాంత్ తన పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com