మయన్మార్‌లో ఘోర ప్రమాదం

- November 22, 2015 , by Maagulf
మయన్మార్‌లో ఘోర ప్రమాదం

 ఉత్తర మయన్మార్‌లోని విలువైన పచ్చరాయి గనుల్లో ఘోర ప్రమాదం సంభవించింది. కచ్చిన రాష్ట్రంలోని హెపకాంట్‌లోని ఉన్న పచ్చరాయి గనుల వద్ద పనిచేసే గూడారాలపై భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతిచెందగా మరో వందమంది ఆచూకీ తెలియకుండా పోయింది. శనివారం రాత్రి మూడు గంటల సమయంలో శ్రామికులు వారి గుడారాల్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి వంద మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. ఇప్పటివరకు ఒక్కరిని శిథిలాలనుంచి సజీవంగా బయటకు తీసినప్పటికీ, ఆ తర్వాత అతను ప్రాణాలు వదిలినట్టు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన పచ్చరాయిని అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కచిన్ ఒకటి. గనుల వద్ద యంత్రాల ద్వారా తవ్విన మట్టి నుంచి వీరు విలువైన పచ్చరాళ్లను సేకరించేవారు. వలసకూలీలు కావడంతో గనుల వద్దే గుడిసెలు వేసుకొని అక్కడే కాలం గడుపుతుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఒక్కసారిగా వీరి నివాసాలపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో కూలీలంతా గాఢనిద్రలో ఉండడంతో చాలామంది దీంతో మట్టికుప్పల్లో కూరుకుపోయి అనేక మంది సజీవసమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో గుడిసెల్లో మైనర్లు అధికంగా నిద్రిస్తున్నట్టు మయన్మార్‌లోని గ్లోబల్ న్యూలైట్ వార్తాపత్రిక పేర్కొంది. శనివారం 79 మృతదేహాలను వెలికితీశామని ఆదివారం మరో 21 బయటపడ్డాయని హాపకాంట్ స్థానిక అధికారి నీలర్ మైంట్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 100 మృతదేహాలను వెలికితీశామన్నారు. అక్కడ ఎంత మంది నివసిస్తున్నారో స్పష్టంగా తెలియదన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ట్రిపుల్ వన్ పచ్చ గనుల ఆధీనంలోని ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పచ్చరాయి గనుల సమీప గ్రామాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం అసాధారణమైన ఘటన అని, దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక్కడి నుంచి విలువైన పచ్చరాళ్లను చైనాకు అక్రమంగా తరలిస్తుంటారు. చైనాలో వీటికి భారీగా డిమాండ్ ఉంది. ఇక్కడ లభించే పచ్చరాయి 30అమెరికన్ డాలర్ల విలువ ఉంటుందని 2014లో పరిశోధకులు తెలిపారు. మయన్మార్ ప్రభుత్వ అంచనాల ప్రకారం 2014లో సుమారు రూ.2 లక్షల కోట్ల పచ్చరాళ్ల వ్యాపారం జరిగింది. ఈ గనితో అనేక ప్రభుత్వాధికారులకు, సైనికాధికారులకు, మాజీ సైనికాధికారులకు సంబంధాలున్నట్టు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com