సత్తా చాటిన త్రివిధ దళాలు

- January 26, 2018 , by Maagulf
సత్తా చాటిన త్రివిధ దళాలు

దేశ రాజధానిలో 69వ గణతంత్య్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాజ్‌ పథ్‌ వేదికగా..  ఏషియన్‌ 10 దేశాల ముఖ్యఅతిథులు వీక్షిస్తుండగా తమ విన్యాసాలను ప్రదర్శించిన త్రివిధ దళాలు ‘భారత్‌ సత్తా ఇది’ అని  చాటి చెప్పాయి. వివిధ రకాల క్షిపణులు, సైనికుల విన్యాసాలను అహుతులు ఆసక్తిగా తిలకరించారు. 

ముందుగా ఉదయం ట్వీటర్‌లో దేశ ప్రజలకు గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమర వీరులకు పుష్ఫ గుచ్ఛాలతో నివాళులర్పించారు.  ఆయన వెంట రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. అక్కడి నుంచి వారంతా రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. ఆసియాన్ కూటమిలో సభ్యదేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్, వియత్నాం అధినేతలు ఈ వేడుకలకు హాజరుకాగా.. వారిని ప్రధాని మోదీ స్టేజీపైకి సాదరంగా ఆహ్వానించారు. ఆపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్‌పథ్‌కు చేరుకోగా.. మోదీ ఆయనకు కరచలనంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఆయనకు ఇదే తొలి వేడుకలన్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
కాగా, దాదాపు 100 అడుగుల పొడవైన వేదికను అతిథుల కోసం ఏర్పాటు చేయగా, చుట్టూ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాస్‌, భద్రత కోసం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి. చుట్టుపక్కల భవనాలపై స్నిప్పర్స్ ను ఏర్పాటు చేశారు. 

ఇండియా సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ త్రివిధ దళాల విన్యాసాలు కొనసాగాయి. వివిధ శాఖల, రాష్ట్రాల శకలాలు ఆకట్టుకున్నాయి.  ఎయిర్ ఫోర్స్ సీ-130 జే సూపర్ హెర్క్యులెస్, సీ-17 గ్లోబ్ మాస్టర్, సుఖోయ్ - 30 ఎంకేఐ ఎస్, లైట్ కాంబాట్ తేజాస్ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. సైన్యానికి చెందిన టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాష్ వెపన్ సిస్టమ్లతో పాటు 113 మంది మహిళలతో కూడిన 'సీమా భవానీ' పరేడ్ లో కదులుతున్న వేళ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి.

ఈసారి లడ్డూ ఇవ్వలేదు... 

గణతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా పాక్‌ సైనికులకు భారత సైన్యం స్వీట్లు పంచటం తెలిసిందే. అయితే ఉరి దాడి తర్వాత... మిఠాయిలను పంచకూడదని బీఎస్‌ఎఫ్‌ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు లడ్డూ పంచకుండానే వేడుకలు నిర్వహించింది. అయితే బంగ్లా సైనికులతో మాత్రం యథావిధిగా స్వీట్లు పంచుకుని వేడుకలు జరుపుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com