పద్మావత్‌తో అసలేం చెప్పదల్చుకున్నావ్‌ సంజయ్‌?

- January 28, 2018 , by Maagulf
పద్మావత్‌తో అసలేం చెప్పదల్చుకున్నావ్‌ సంజయ్‌?

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీపై విలక్షణ నటి స్వర భాస్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మావత్‌ చిత్రం ద్వారా ప్రజలకు అసలేం సందేశం ఇవ్వదల్చుకున్నావంటూ భన్సాలీని ఆమె ఏకీపడేవారు. ఈ మేరకు ఆమె రాసిన ఓ బహిరంగ లేఖను ది వైర్‌ శనివారం ప్రచురించింది. 

‘‘అత్యాచార బాధితులు, వితంతువులు, చిన్న, పెద్దా, ముసలి, గర్భవతి... ఇలా మహిళలకు ఈ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. మరి అలాంటప్పుడు పద్మావత్‌ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు?. చిత్రం చివరలో దీపిక చేసిన పద్మావతి పాత్ర అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటుందని చూపించారు. అయ్యా భన్సాలీగారు... ఇది 13వ శతాబ్దం కాదు.. 21వ శతాబ్ధం. మహిళలకు మాన-ప్రాణాల మీద అవగాహన,ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారిలో రాను రాను మనోధైర్యం కూడా చాలా పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో పద్మావత్‌ ద్వారా మీరు అసలు ఏం చెప్పదల్చుకున్నారు?. 

సతీ సహగమనం, జౌహర్‌(ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు) వంటి దురాచారాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మరి గ్రాండియర్‌ పేరిట పద్మావత్‌తో ఎలాంటి సందేశం ఇచ్చారో మీ ఆత్మ సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండి?’’ అంటూ స్వర భాస్కర్‌ 8 పేరాల లేఖలో భన్సాలీకి ప్రశ్నల వర్షంతో చురకలు అంటించారు. అయితే భన్సాలీ మాత్రం ఆమె విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. గతంలో కూడా స్వర భాస్కర్‌ భన్సాలీ చిత్రాలపై తరచూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

తను వెడ్స్‌ మను, రాంఝ్‌నా, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో లాంటి కమర్షియల్‌ చిత్రాలతోపాటు నీల్‌ బటే సన్నాటా, అనార్కలీ ఆఫ్‌ ఆరా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో స్వర భాస్కర్‌ మంచి గుర్తింపు పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com