భారత నావికుల నౌక ఏమైంది?.. హైజాక్?!
- February 03, 2018
న్యూఢిల్లీ: 22మంది భారతీయ నావికులతో వెళ్తున్న ఎంటి మెరైన్ ఎక్స్‌ప్రెస్ అనే ట్యాంకర్ నౌక ఆఫ్రికా తీర జలాల్లో కనిపించకుండా పోయింది. దాదాపు 8.1మిలియన్ డాలర్ల విలువ చేసే గ్యాసోలిన్ తీసుకెళ్తున్న ఈ నౌక హైజాక్ అయ్యిందేమోనని అనుమానిస్తున్నారు. ఈ నౌక పశ్చిమ ఆఫ్రికా దేశమైన బెనిన్ వద్ద కనిపించకుండా పోయింది.
కాగా, గత 48 గంటలుగా నౌక ఎక్కడుందో తెలియరాలేదు. సముద్ర దొంగలు నౌకపై దాడి చేసే అవకాశం కూడా ఉందని షిప్పింగ్ విభాగానికి చెందిన అధికారులు భావిస్తున్నారు. ఇదే ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఎంటీ బారెట్ నౌక కూడా కనిపించకుండా పోయింది.
మెరైన్ ఎక్స్‌ప్రెస్ చివరగా జనవరి 31న సాయంత్రం ఆరున్నర సమయంలో బెనిన్లోని కొటోనోవు తీరంలో కనిపించింది. తర్వాత రోజు తెల్లవారుజామున 2.36 ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ గునియా నుంచి నౌక కనిపించకుండా పోయింది.
ఈ ట్యాంకర్ నౌకలో 13,500 టన్నుల గ్యాసోలిన్ ఉందని షిప్పింగ్ ఇండస్ట్రీకి చెందిన అధికారులు వెల్లడించారు. ఒక్కో టన్ను గ్యాసోలిన్ 600డాలర్లు ఉంటుందని.. మొత్తం నౌక విలువ దాదాపు 8.1మిలియన్ డాలర్లు (సుమారు రూ.52కోట్లు) ఉంటుందని అంచనా వేశారు.
గ్యాసోలిన్ దొంగిలించడానికి సముద్ర దొంగలు దాడి చేసే అవకాశం ఉందని లేదా హైజాక్ చేసే అవకాశాలూ చాలా ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నౌక పనామా దేశంలో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. నౌకలోని 22 మంది సిబ్బంది భారతీయులు. వారు ముంబైలోని అంధేరీ తూర్పు ప్రాంతంలోని ఎం/ఎస్ ఆంగ్లో ఈస్ట్రన్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన సిబ్బంది అని తెలిసింది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నౌక ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నౌకను గుర్తించి సిబ్బందితో మాట్లాడే వరకు హైజాక్ అయ్యిందా, సముద్ర దొంగలు దాడి చేశారా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేమని నైజీరియాలోని భారత హైకమిషన్ వెల్లడించారు. కాగా, ఆచూకీ లేకుండా పోయిన నౌక కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







