శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట..

- November 25, 2015 , by Maagulf
శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట..

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలాచరించిన అనంతరం భక్తులు కార్తీక దీపారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్తీకపౌర్ణమి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువ జామునుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపారాధనలు చేసి నదీమతల్లికి హారతులు సమర్పించారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తజనసంద్రమైంది. పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. పాతాళగంగలో స్నానమాచరించిన భక్తులు గంటలో దీపాలు విడిచిపెట్టారు. భ్రమరాంబమల్లికార్జున స్వామివారి సుప్రభాత, మహామంగళహారతులు తరువాత భక్తులను అనుమతించారు. వేములవాడ రాజన్న సన్నిధిలో కార్తీక శోభ కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరీ ఆలయంలో బుధవారం కార్తీక శోభ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి ఆలయ ధర్మగుండంలో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి మహా లఘుదర్శనం ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం స్వామి వారికి జ్వాలా తోరణం, మహాపూజలు చేయనున్నారు. యాదాద్రిలో భ‌క్తుల కిట‌కిట‌ నల్గొండ జిల్లా యాదాద్రిలో భక్తుల సందడి నెలకొంది. విష్ణుపుష్కరినిలో స్నానమాచరించి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేళ్ల‌చెరువు ఆల‌యంలో... నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కంటికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పరమేశ్వరున్ని దర్వించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కీస‌ర ఆల‌యంలో.. రంగారెడ్డి కీసర భక్తజనసంద్రమైంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తులు పంచామృత అభిషేకాలు దీపారాదనలు చేసి మంగళనీరాజనాలు అందించారు. భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పవిత్ర గోదావరి నదిలో బుధవారం తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించారు. గోదావరి నదికి పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. చల్లంగా చూడాలి తల్లీ అంటూ గోదావరిమాతను వేడుకుని పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరి దర్శనం కోసం వేచి ఉన్నారు. భద్రాచలంలోని రామాలయం, శివాలయం, ఆంజనేయస్వామి, సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుకుటేశ్వరస్వామికి పంచామృతమహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి రక్షపత్రిపూజ, లక్ష కుంకుమార్చన చేశారు. తూర్పు., ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పంచారామాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.. శివ‌నామ స్మ‌రణ‌తో ఆల‌యాలు పుల‌కించిపోతున్నాయి.. దీపోత్స‌వాల‌లో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొంటున్నారు. సూర్యలంకతీరంలో సాగర హారతి గుంటూరు జిల్లా బాపట్లలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంక తీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటలకే సూర్యలంక తీరానికి చేరుకుని పుణ్యస్నానాలాచరించారు. కరవు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ఆధ్వర్యంలో రత్నగర్భ సాగరహారతిని కన్నులపండువగా నిర్వహించారు. ఎమ్మెల్సీతో పాటు ఎంపీపీ మానం విజేత, పురపాలక ఛైర్‌పర్సన్ తోటమల్లేశ్వర్ సాగరుడికి హారతినిచ్చి పుణ్యస్నానాలు చేశారు. చీచ్‌లో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని ప్రారంభించారు. కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన మహా శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా ఆధ్వర్యంలో 40వేల మంది భక్తులకు అల్పాహారం, ఐదు లక్షల తాగునీటి పాకెట్లను పంపిణీ చేశారు. ఆగ‌స్తేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో.. కడప జిల్లా రాజంపేట మండలం గుంగులూరులోని శ్రీ ఆగస్తేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ముక్కంటికి పంచామృత అభిషేకం నిర్వహించారు. బహుదానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సదాశివునికి దీపారాదన చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com