ఏపీ విభజన హామీలపై తగ్గేది లేదంటున్న ఏపీ ఎంపీలు..!

- February 07, 2018 , by Maagulf
ఏపీ విభజన హామీలపై  తగ్గేది లేదంటున్న ఏపీ ఎంపీలు..!

పార్లమెంటులో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసనలు కొనసాగనున్నాయి. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉభయ సభల్లో ఏపీ విభజన హామీలపై స్పష్టత ఇచ్చినా.. ప్రధాని హామీ ఇచ్చినా ఎంపీలు తగ్గడం లేదు. హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని సభలోనే తెలియజేయాలని ఎంపీలు పట్టుబడుతున్నారు. గత రెండు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీలు తమ నిరసనను ఈరోజు కూడా కొనసాగించనున్నారు. మరికాసేపట్లో వైసీపీ ఎంపీలు హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలవనున్నారు. హామీల అమలుపై స్పష్టత వచ్చే వరకూ ఆందోళన కొనసాగతుందని వైసీపీ ఎంపీలు తెలిపారు.

చంద్రబాబు సూచనల మేరకు...

అలాగే టీడీపీ ఎంపీలు కూడా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరికాసేపట్లో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఇంట్లో టీడీపీ ఎంపీలు భేటీ కానున్నారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న సభలో ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారని స్పష్టంగా తెలియజేయాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్. ప్రతి సారీ చేస్తాం.చూస్తాం.. అని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదన్నది టీడీపీ ఎంపీల అభిప్రాయం. నాలుగేళ్లయినా ఇంతవరకూ హామీలు అమలు చేయకపోవడంపై అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేడు కూడా నిరసననను తెలియజేయాలని నిర్ణయించింది. మరి ఈరోజు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com