సినీ ఫక్కీలో పోలీసులు నాటకీయంగా 69 మంది రౌడీల అరెస్టు

- February 07, 2018 , by Maagulf
సినీ ఫక్కీలో పోలీసులు నాటకీయంగా 69 మంది రౌడీల అరెస్టు

చెన్నై, న్యూస్‌టుడే: ఓ రౌడీ జన్మదిన వేడుకలకు హాజరైన నేరగాళ్లను పోలీసులు సినీ ఫక్కీలో చుట్టుముట్టారు. మొత్తం 69 మందిని ఈ సందర్భంగా అరెస్టు చేశారు. నగర శివారు మంగళవారం రాత్రి హడలెత్తిపోయింది. ఓ లారీషెడ్‌లో పరారీలో ఉన్న నేరగాడు జన్మదిన వేడుకలు చేసుకోగా... దానికి నగరం, శివారు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో నేరగాళ్లు హాజరయ్యారు. పలు వాహనాల్లో వచ్చి ఒకేచోట వారు సమావేశమైన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దీని గురించి ముందే తెలిసిన పోలీసులు నాటకీయంగా ఆ షెడ్‌ను చుట్టుముట్టి తుపాకులతో బెదిరించి 69 మందిని అరెస్టు చేశారు. మరికొందరు తప్పించుకున్నారు. ఈ సందర్భంగా పలు మారణాయుధాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం... చెన్నై చూళైమేడుకు చెందిన బిను పేరు మోసిన రౌడీ. పరారీలో ఉన్న అతడు శివారులోని మాంగాడు సమీపాన మలైయంబాక్కంలోని ఓ లారీషెడ్‌లో మంగళవారం రాత్రి తన పుట్టినరోజు వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశాడు. ఇందులో పాల్గొనాలంటూ తన ముఠా సభ్యులు, నగరం, శివారు ప్రాంతాల్లోని పలువురు రౌడీలు, నేరస్తులకు ఆహ్వానాలు పంపాడు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. అందరినీ ఒకేసారి పట్టుకోవాలని నిర్ణయించారు. పోలీసు జీపుల్లో వెళ్తే అప్రమత్తమై వారు తప్పించుకునే అవకాశాలు ఉండటంతో కార్లలో వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు మంగళవారం అర్ధరాత్రి అంబత్తూరు డిప్యూటీ పోలీస్‌ కమిషనరు సర్వేశ్‌రాజ్‌ ఆధ్వర్యంలో సహాయ కమిషనరు కన్నన్‌, విల్సన్‌, నందకుమార్‌, పది మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు తదితర 50 మంది ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ పలు కార్లు, మోటారు బైక్‌లు, ఆటోలు వరుసగా నిలిపి ఉన్నాయి. లారీషెడ్‌లో రౌడీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని వాటి ఆధారంగా అంచనా వేశారు. వారి వద్ద మారణాయుధాలు కూడా ఉండొచ్చని ముందే ఊహించి సిద్ధంగా వచ్చిన పోలీసులు.... ఆ లారీషెడ్‌లోకి తుపాకులతో వెళ్లారు. అనూహ్య పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన రౌడీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తోచిన దిక్కుకు పరుగులు పెట్టారు. తుపాకులు చూపించి 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పరుగులు పెట్టినవారిని వెంబడించారు. సమీపంలోని ముళ్ల పొదలు చాటున తలదాచుకున్న 29 మందిని కూడా తుపాకులతో హెచ్చరించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన రౌడీల్లో కరుడుకట్టిన రౌడీలు కూడా ఉన్నారు. మదురవాయల్‌కు చెందిన జెనిసన్‌, అతడి తమ్ముడు నిర్మల్‌, పుళియంతోపునకు చెందిన శరవణన్‌, పట్టాభిరామ్‌కు చెందిన మాట్టు శంకర్‌ తదితర 10 మంది రౌడీలు కీలకమైనవారు. నేరస్తుల జాబితాలో ఉన్నవారు కూడా ఉన్నారు. అరెస్టు అనంతరం మాంగాడు, పోరూర్‌ తదితర పోలీస్‌స్టేషన్లలో వారిని ఉంచి విచారణ జరిపారు. వీరిలో కొందరు పలు నేరాలతో సంబంధం ఉన్నవారు, మరికొందరు పాత నేరస్తులని తేలింది. ఘటనా స్థలి నుంచి 60 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 7 కార్లు, పలు వేటకొడవళ్లు, 35 కత్తులు, 60 ఖరీదైన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అర్ధరాత్రి ఉద్రిక్తత 
పోలీసులు లారీషెడ్‌లోకి ప్రవేశించడానికి ముందే ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. లారీషెడ్‌లో రౌడీ బిను పెద్దకత్తితో కేక్‌ కోయగా.... మిగతావారు నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో వాహనాలు ఒకే చోటకు చేరడంతో ఏదో అసాంఘిక చర్యలకు కుట్ర జరుగుతోందనే ప్రచారం కూడా సాగింది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ స్థానికులు గడిపారు. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. పోలీసులు లారీషెడ్‌ను ముట్టడించిన తర్వాత పలువురు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోరూర్‌ సహాయ కమిషనరు కన్నన్‌ దీని గురించి మాట్లాడుతూ... రౌడీల సమావేశం గురించి సాయంత్రం 5.45 గంటలకు సమాచారం అందిందని తెలిపారు. దీంతో అంబత్తూరు డిప్యూటీ కమిషనరు సర్వేశ్‌రాజ్‌తో వెంటనే సమాలోచన నిర్వహించామని పేర్కొన్నారు. తర్వాత ప్రైవేటు వాహనాల్లో మలైయంబాక్కం వెళ్లి రహస్య ప్రాంతాల్లో మకాం వేశామని తెలిపారు. రాత్రి 9 గంటలకు రౌడీల పట్టివేత ప్రారంభమై బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగిందని పేర్కొన్నారు. అంబత్తూరు డిప్యూటీ కమిషనరు సర్వేశ్‌రాజ్‌ మాట్లాడుతూ... మలైయంబాక్కం శివారు ప్రాంతం కావడం, తప్పించుకోవడానికి పలు మార్గాలు ఉండటంతో రౌడీలు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని తెలిపారు. పారిపోయిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. పశ్చిమ జోన్‌ జాయింట్‌ కమిషనరు సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ... భారీసంఖ్యలో ఒకేచోట రౌడీలు చిక్కడం ఇదే తొలిసారని తెలిపారు. ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయనే జాబితా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com