కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- February 27, 2026
భారతీయ రైల్వే చరిత్రలో కోల్‌కతా మెట్రో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్’ (BESS)ను మెట్రో రైళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు.
సాధారణంగా విద్యుత్ అంతరాయం కలిగితే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ సెక్షన్లలో ఇది ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, ఈ కొత్త బ్యాటరీ వ్యవస్థ సాయంతో విద్యుత్ నిలిచిపోయినప్పటికీ, రైలును సురక్షితంగా సమీపంలోని స్టేషన్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులు సొరంగ మార్గాల్లో చిక్కుకుపోయే ప్రమాదం తప్పుతుంది.
కోల్‌కతాలోని అండర్ గ్రౌండ్ ‘బ్లూ లైన్’లో తరచుగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో రైళ్లు ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మెట్రో అధికారులు 6.4 MWh సామర్థ్యం ఉన్న భారీ ‘లిథియం ఐరన్ ఫాస్పేట్’ బ్యాటరీలను మెట్రో సెంట్రల్ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ శక్తివంతమైన బ్యాటరీలు అత్యవసర సమయాల్లో వెన్నెముకలా నిలుస్తాయి.
ఏదైనా కారణాలతో మెయిన్ విద్యుత్ సరఫరా ఆగిపోతే.. బ్యాటరీల ద్వారా ఇంజిన్లకు కరెంట్ పంపిణీ చేస్తారు. దీంతో మధ్యలోనే రైళ్లు నిలిచిపోకుండా సమీప మెట్రో స్టేషన్ వరకు చేరుకుంటాయని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా దిగొచ్చని కోల్‌కతా మెట్రో అధికారులు పేర్కొన్నారు. రైలు గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని, టన్నెల్ వెంటిలేషన్ తదితర ముఖ్యమైన వ్యవస్థలకూ బ్యాటరీల ద్వారా విద్యుత్ అందుతుందని చెప్పారు.
BESS వ్యవస్థలో ఇన్వర్టర్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీలు ఉంటాయి. విద్యుత్తు అంతరాయం లేదా గ్రిడ్ వైఫల్యం సంభవించినప్పుడు నిల్వ చేసిన ఎనర్జీని అందించగలవు. 4 MW BESS అనేది 2021లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ ప్రకారం రూపకల్పన జరిగింది. ఈ వ్యవస్థ జీవితకాలం సుమారు 14 సంవత్సరాల. డిజైన్‌లో కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది సాంప్రదాయ జనరేటర్ల కంటే మెరుగైన శక్తి సామర్థ్యంతో పనిచేయడమే కాదు.. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







