రివ్యూ: నీదీ నాదీ ఒకే కథ
- March 23, 2018
రివ్యూ:
చిత్రం: నీదీ నాదీ ఒకే కథ
నటీనటులు: శ్రీ విష్ణు.. సత్నా టిటస్.. దేవీ ప్రసాద్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: రాజ్ తోట, పర్వీజ్ కె
కూర్పు: బి.నాగేశ్వరరెడ్డి
కళ: టి.ఎన్.ప్రసాద్
నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు వూడుగుల
బ్యానర్: ఆరాన్ మీడియా వర్క్స్, శ్రీ వైష్ణవి క్రియేషన్స్
సమర్పణ: నారా రోహిత్, అట్లూరి నారాయణ రావు
విడుదల తేదీ: 23-03-2018
సి నిమాల ఎంపిక విషయంలో నేటి యువతరం కథానాయకులు మారారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను ఎంచుకుంటున్నారు. అలా విభిన్న నేపథ్యాల కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే మరో పక్క ఇతర హీరోలతో కలిసి తెర పంచుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. గతేడాది ఆయన నటించిన 'మెంటల్ మదిలో' ఫీల్‌గుడ్ మూవీగా అలరించింది. ఇప్పుడు 'నీదీ నాదీ ఒకే కథ' అంటూ మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'మేధావులు, పక్కనవాళ్ల పనిని, పనితనాన్ని చులకనగా చూసేవారు దయచేసి మా సినిమాకు రాకండి. ఇది కేవలం మాకు, మాలాంటి వాళ్లకు సంబంధించిన కథ. ఏ మాత్రం హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెట్ ట్విస్ట్‌లు, క్లైమాక్స్ ఫైట్లు, ఆఖరికి రాహుల్ ద్రవిడ్ యాడ్ కూడా లేని ఒక సామాన్యుడి కథ.. ఇది మా కథ.. మీ కథ..' అంటూ గమనిక పెట్టి మరీ ప్రచారం చేశారు. మరి శ్రీవిష్ణు చేసిన మరో విభిన్న ప్రయత్నం ఎలా ఉంది? కొత్త దర్శకుడు వేణు వూడుగల ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు?
కథేంటంటే: నాలుగు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న రుద్రరాజు దేవీ ప్రసాద్(దేవీ ప్రసాద్) కుమారుడు రుద్రరాజు సాగర్ (శ్రీ విష్ణు). 'పండిత పుత్ర పరమ శుంఠ' అన్నట్టుగా చదువుల్లో పరమ పూర్. డిగ్రీ తన్నుతూ తన్నుతూ తన చెల్లెలితో కలిసి పరీక్షలు రాస్తాడు. చదువు అస్సలు ఎక్కదు. పరీక్షలంటే భయం. కానీ, తన తండ్రి ఆనందం కోసం ఏదైనా చేద్దామని తహతహలాడుతుంటాడు. అందుకోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ, ఆ క్లాస్‌లకు వెళ్తూ తనని తాను మార్చుకుంటూ.. నాన్నకు నచ్చేట్లుగా బతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. ఈ ప్రయత్నంలో సాగర్ ఏం తెలుసుకున్నాడు? జీవితానికి, జీవితంలో స్థిర పడటానికి తనిచ్చిన నిర్వచనం ఏంటి? అనేదే కథ.
ఎలా ఉందంటే?: జీవితంలో స్థిర పడటం అంటే ఏంటి? డబ్బులు సంపాదించడంలోనే ఆనందం ఉంటుందా? అనే పాయింట్‌ను టచ్ చేస్తూ సాగే కథ ఇది. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు.. వ్యక్తిత్వ వికాస విజ్ఞులు చెప్పే మాటలు అన్నీ శుద్ధ దండగ అనే తెల్చి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాగర్ అనే కుర్రాడి పాత్రని మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పాత్రని ఈతరం కుర్రకారు చాలామంది తమతో పోల్చి చూసుకుంటారు. సన్నివేశాలు, పాత్రల మధ్య సంఘర్షణ అన్నీ సహజంగా ఉన్నాయి. పరీక్షల కోసం కుర్రాళ్లు పడే కుస్తీలు, పిల్లలపై తల్లిదండ్రుల ఆశలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇచ్చే ఉపన్యాసాలు ఇవన్నీ కళ్లకు కట్టినట్లు చూపించాడు. 'తారే జమీన్ పర్', 'త్రీ ఇడియట్స్' సినిమాల స్ఫూర్తి ఇందులో కనిపిస్తుంది. మనకు నచ్చిన పనిచేయడంలోనే ఆనందం ఉంది అనే ఇతివృత్తాన్ని మనసుకు హత్తుకునేలా చూపించాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కూడా అందుకు బలాన్ని ఇస్తాయి. విద్యార్థుల మనస్తత్వాలు.. తల్లిదండ్రుల ఆలోచలు.. ర్యాంకుల కోసం పరుగు.. ఇలాంటివి మారాలని చాటి చెప్పే చిత్రం ఇది. భవిష్యత్‌లో ఏదో కావాలని చిన్న చిన్న ఆనందాలను వదిలేసి వెంపర్లాడే ఈ తరానికి కళ్లకు కట్టేలా గట్టి సందేశాన్ని ఇచ్చింది.
ఎవరెలా చేశారంటే: శ్రీవిష్ణు తన కెరీర్‌లో మరోసారి అద్భుతమైన నటన కనబరిచాడు. సాగర్ పాత్రను నూటికి నూరుపాళ్లు అర్థం చేసుకుని అందులో ఒదిగి పోయిన తీరు ఆకట్టుకుంటుంది. కథానాయిక పాత్రకూ ప్రాధాన్యం ఉంది. ఆమె కూడా బాగా చేసింది. కథానాయకుడికి సమానమైన పాత్ర పోషించాడు దేవీ ప్రసాద్. ఒక మధ్య తరగతి తండ్రిగా సహజంగా నటించాడు. సంగీతం, పాటలు అందులోని అర్థవంతమైన పదాలు ఈ కథకు మరింత వన్నె తెచ్చాయి. చాలా సహజమైన వాతావరణంలో సినిమాను తెరకెక్కించారు. ఎక్కడా సెటింగ్ ఆర్భాటాలు కనిపించవు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తది. ఆ విషయాన్ని పక్కదారి పట్టకుండా చాలా చక్కగా చెప్పాడు.
బలాలు
+ కథాంశం
+ శ్రీవిష్ణు, దేవీ ప్రసాద్‌ల నటన
+ మనసుకు హత్తుకునే సన్నివేశాలు
బలహీనతలు
- అక్కడక్కడా నెమ్మదించిన కథనం
చివరిగా: మన 'తారే జమీన్ పర్'.. 'నీదీ నాదీ ఒకే కథ'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!