ఇస్రో విజయం...నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ41

- April 11, 2018 , by Maagulf
ఇస్రో విజయం...నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ41

చెన్నై : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 43వ ప్రయోగం విజయవంతమైంది. ఈ రోజు ఉదయం 4.04గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ41 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి కక్ష్యలోకి దూసుకెళ్లింది. 36 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న అనంతరం ఉదయం 4.04 గంటలకు మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశానికి సొంత మార్గనిర్దేశక (నావిగేషన్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో చేపట్టిన నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెల్లేషన్) ప్రాజెక్టులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఈ ప్రాజెక్టులో ఇది ఎనిమిదో ఉపగ్రహం. ఇదే చివరి ఉపగ్రహం కూడా. ఇప్పటికే ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇవన్నీ భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగనున్నాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ బరువు 1,425 కిలోలు. రాకెట్ ఎత్తు 44.4 మీటర్లు కాగా, శాటిలైట్, పేలోడ్‌తోసహా మొత్తం బరువు 321 టన్నులు. ప్రయోగ సమయం 19 నిమిషాల 19.6 సెకండ్లు. మొత్తం నాలుగు దశల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు సొంతగా మార్గనిర్దేశక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశ అవసరాల కోసం అమెరికాకు చెందిన గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం(జీపీఎస్)పై ఆధారపడుతున్నాం. ప్రజా అవసరాలతోపాటు మిలిటరీకి వ్యూహాత్మకంగా ఉపయోగపడేలా నావిక్‌ను ఇస్రో రూపొందించింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,246 కోట్లు. త్వరలో ఈ ప్రాజెక్టులోని ఉపగ్రహాల సంఖ్యను 8 నుంచి 11కు పెంచనున్నారు. భవిష్యత్‌లో నావిక్ సేవలను విమానయాన రంగానికి సైతం విస్తరించాలని ఇస్రో నిర్ణయించింది. ఇస్రో గత నెలలో నిర్వహించిన జీఎస్‌ఏటీ-6ఏ ఉపగ్రహ ప్రయోగం మొదట్లో విజయవంతమైనా, ఆ తర్వాత ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో తాజా ప్రయోగంతో విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com