గాజా సరిహద్దుల్లో రోజంతా కొనసాగిన ఘర్షణలు

- April 14, 2018 , by Maagulf
గాజా సరిహద్దుల్లో రోజంతా కొనసాగిన ఘర్షణలు

గాజా : ఇజ్రాయిల్‌, గాజా మధ్య సరిహద్దుల్లో పాలస్తీనా ప్రదర్శనకారులు, ఇజ్రాయిల్‌ సైనికుల మధ్య శుక్రవారం రోజంతా జరిగిన ఘర్షణల్లో ఒక పాలస్తీనియుడు మరణించగా దాదాపు వెయ్యి మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ కెద్రా విలేకర్లతో మాట్లాడుతూ, గాజా నగరానికి చెందిన 28ఏళ్ళ ఇస్లామ్‌ హెర్జల్లా ఇజ్రాయిల్‌ తుపాకీ కాల్పుల్లో మరణించాడని తెలిపారు. గాయపడిన వారిలో పేరా మెడికల్‌ సిబ్బందితో పాటు ఏడుగురు స్థానిక జర్నలిస్టులు, కెమెరామెన్‌లు వున్నారని తెలిపారు. వీరిలో తుపాకీ గుళ్ళ వల్ల గాయపడిన వారు 170మంది వున్నారని చెప్పారు. ఇజ్రాయిల్‌తో తూర్పు గాజాలో గల సరిహద్దుకు సమీపంలో వేలాదిమంది పాలస్తీనియన్లు నిరసనల్లో పాల్గన్నారు. వీరితో ఇజ్రాయిల్‌ సైనికులు ఘర్షణలకు దిగారు. ఇజ్రాయిల్‌ సైనికుల తుపాకీ కాల్పుల నుండి రక్షణ కోసం ఆందోళనకారులు పెద్దసంఖ్యలో టైర్లను తగలబెట్టారు. దట్టంగా కమ్ముకున్న పొగను అడ్డం చేసుకుని వారు తమని తాము కాపాడుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయిలీ పతాకాలను దగ్ధం చేశారు. హమస్‌ ప్రతినిధి ఫజ్వి బర్హామ్‌ మాట్లాడుతూ, పాలస్తీనా భూమిని ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని అందుకే ఇజ్రాయిల్‌ పతాకాలను దగ్ధం చేశామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com