గల్ఫ్‌ దేశాల తరహాలో శిక్షలు అమలు చెయ్యాలి

- April 14, 2018 , by Maagulf
గల్ఫ్‌ దేశాల తరహాలో శిక్షలు అమలు చెయ్యాలి

తిరుపతి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణకు ఎన్నో చట్టాలను చేసినప్పటికీ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదని, గల్ఫ్‌ దేశాల తరహాలో దోషులను శిక్షించినప్పుడే పరిస్థితి మారుతుందని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. శనివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా సమస్యలపై చర్చించిన విషయాలు ఆమె మాటల్లోనే.. ఖఖమహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవి నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. మహిళల సమస్యలు, అన్యాయాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి బాధితులకు అండగా ఉంటూ ఆదుకుంటున్నారు. చంద్రబాబు ఇస్తున్న భరోసాతోనే సమస్యల్లో ఉన్న మహిళలకు పరిష్కారం చూపగలుగుతున్నాం. ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల నేరాలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు జరిగే తీరు ఎంతో ఆవేదన కలిగిస్తోంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులను కఠినంగా శిక్షిస్తున్నాం. అయినా కొందరు కీచకులు మారకుండా అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులు, అకృత్యాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన మార్గాలను అన్వేషిస్తున్నాం. సమాజం కూడా ఈ విషయం గురించి పట్టించుకోవాలి. దోషులను ఎవరూ ఉపేక్షించకూడదు. నేరస్థుల తరఫున ఎవరూ వత్తాసు పలకకూడదు. న్యాయవాదులు సైతం వాదించకూడదు. సమాజం దోషులను వెలివేయాలి. చట్టాలెన్నున్నా అంటువ్యాధిలాగా నేర ప్రవృత్తి పెరుగుతోంది. మహిళా పోలీసు స్టేషన్లు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలి. గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు గస్తీ పెంచాలి. నేరప్రవృత్తి ఉండే ప్రాంతంలో సీసీ కెమరాలు, షీటీంలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. గల్ఫ్‌ దేశాల తరహాలో దోషులను ఉరి తీయాలి. నడిరోడ్డుపై కాల్చి చంపే పద్ధతి రావాలి. చైనాలో దోషుల అవయవాలు కత్తిరిస్తారు. ఇలా చేస్తే నేరస్థుల్లో తప్పు చేయాలనే ఆలోచనే రాదు. మహిళలు కూడా ఆత్మ రక్షణ విద్యలు నేర్చుకోవాలి. తమపై దాడికి దిగే వారిని ఎదుర్కోవాలి'' అని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com