శ్రీ రెడ్డి కామెంట్స్ పై స్పందించిన నాగబాబు

- April 18, 2018 , by Maagulf
శ్రీ రెడ్డి కామెంట్స్ పై స్పందించిన నాగబాబు

నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం పక్కదారి పట్టిందని సినీ నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు.. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వివాదంలోకి సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి అంశాన్ని పక్కదారి పట్టించడంతోనే తాను స్పందించేందుకు వచ్చినట్లు తెలిపారు. తాను ఓ మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని తన మాటలను యూట్యూబ్‌ ఛానళ్లు వక్రీకరించొద్దని హితవు పలికారు. 'మా అసోసియేషన్‌ అనేది సభ్యుల కోసం పనిచేస్తోంది. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. సభ్యులుగా ఉన్న ప్రతివారికీ పాత్రలు ఇప్పించాలని లేదు. ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే వెంటనే స్పందించి న్యాయం చేస్తాం. నటులకు నిర్మాతలు రెమ్యునరేషన్‌ ఇవ్వకపోతే మాట్లాడి ఇప్పిస్తాం. సీనియర్‌ నటులు ఎంతోమందికి పింఛన్లు ఇస్తున్నాం. మా అసోసియేషన్‌ అద్భుతాలేమీ సృష్టించదు. సభ్యుల సమస్యలు మాత్రమే తీరుస్తుంది. మా అసోసియేషన్‌ ఫీజు కింద రూ.లక్ష తీసుకుంటోంది. సభ్యత్వం ఉచితంగా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే 'మా' ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. మా అసోసియేషన్‌తో ఎవరికైనా వివాదం తలెత్తితే పోలీస్‌స్టేషన్‌ లేదా న్యాయస్థానానికి వెళ్లొచ్చు' అని నాగబాబు సూచించారు. 

'సినీ రంగంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అన్నది కొత్తేమీ కాదు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సినీరంగం అనేది మినీ ప్రపంచం. ఇక్కడ దేవుళ్లు, దేవతలు ఉండరు. మనుషులే ఉంటారు. ఎవడైనా తమను వంకరగా చూస్తే అరెస్టు చేయించే హక్కు మహిళలకు ఉంది. అలాగే సినీ రంగంలోనూ ఇలాంటివి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మహిళలపై ఇలాంటి అకృత్యాలకు నేను వ్యతిరేకం. ఎవరైనా ఆడపిల్లను ప్రలోభపెట్టే పనులు చేసినట్లు నా దృష్టికి వస్తే వాడి చెంప పగలగొడతాను. ఇద్దరు ముగ్గురికి నా నుంచి ఇలాంటి అనుభవం ఎదురైంది. సినీ రంగంలో ఎవరైనా తమను వేధిస్తే అమ్మాయిలు చెప్పు తీసుకొని కొట్టండి. సినీ పరిశ్రమలో 10 శాతం మంది వెధవలు ఉంటే.. 90శాతం మంది మంచి వాళ్లున్నారు. కొందరిని చూసి ఇక్కడ అందరూ అలాంటివారే అన్న అభిప్రాయం ఏర్పరచుకోవడం మంచిది కాదు. ఈ పరిశ్రమపై గౌరవం ఉంది కాబట్టే నా కూతురిని ఈ రంగంలోకి ఆహ్వానించా. ఇక్కడ ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అమ్మాయిలు తమకు మంచివారుగా అనిపించిన వారికి చెప్పండి' అని నాగబాబు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com